Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: టార్గెట్ 50% – మిషన్ 400+.. విపక్షాలకు చెక్ పెట్టేలా మోదీ మార్క్ వ్యూహం..! బీజేపీ నయా టార్గెట్ ఇదే..

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుస విజయాలకు సవాలు విసురుతున్న ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A) ని ఎదుర్కొనేందుకు కమలనాథులు సరికొత్త అస్త్రాలకు పదునుపెట్టారు. వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విపక్షాలన్నీ కలిసినా సరే తమను చేరుకోలేనంత ఓటుబ్యాంకు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అంటే బీజేపీ పోటీ చేసిన ప్రతిచోటా 50 శాతం లేదా ఆపై ఓట్లను కైవసం చేసుకోవాలి.

BJP: టార్గెట్ 50% - మిషన్ 400+.. విపక్షాలకు చెక్ పెట్టేలా మోదీ మార్క్ వ్యూహం..! బీజేపీ నయా టార్గెట్ ఇదే..
PM Modi
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 25, 2023 | 10:44 AM

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుస విజయాలకు సవాలు విసురుతున్న ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A) ని ఎదుర్కొనేందుకు కమలనాథులు సరికొత్త అస్త్రాలకు పదునుపెట్టారు. వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విపక్షాలన్నీ కలిసినా సరే తమను చేరుకోలేనంత ఓటుబ్యాంకు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అంటే బీజేపీ పోటీ చేసిన ప్రతిచోటా 50 శాతం లేదా ఆపై ఓట్లను కైవసం చేసుకోవాలి. మరి ఇది సాధ్యపడేనా? బీజేపీ వ్యతిరేక ఓట్లన్నింటినీ గంపగుత్తగా కూడగట్టి తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న విపక్ష కూటమి వేస్తున్న ఎత్తులను ఈ పైఎత్తు చిత్తు చేస్తుందా? గత ఎన్నికల గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఓసారి లోతుగా పరిశీలించి, విశ్లేషిద్దాం.

విపక్షాల ‘ఉమ్మడి’ అభ్యర్థి వ్యూహం!

ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ అభిప్రాయం అంటాం. మెజారిటీ అంటే 100 మందిలో కనీసం 51 మంది ఒకే అభిప్రాయంతో ఉన్నప్పుడు వారిది మెజారిటీ అభిప్రాయంగా పరిగణిస్తాం. కానీ భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఎన్నికల్లో గెలుపొందాలంటే అభ్యర్థి మిగతా అందరి కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే చాలు. ఈ క్రమంలో 50 శాతం ఓట్లు కూడా అవసరం లేదు. పోటీలో ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు గెలుపొందే వ్యక్తికి 50 శాతాన్ని మించి ఓట్లు వస్తాయి తప్ప ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నప్పుడు 40 శాతం కంటే తక్కువ ఓట్లతో కూడా సునాయాసంగా గెలుపొందవచ్చు. అంటే మిగతా 60 శాతాన్ని మించిన ఓటర్లు ఆ అభ్యర్థిని కోరుకోకపోయినా సరే.. ఆ అభ్యర్థి గెలుపొందవచ్చు. ఇందుక్కారణం.. ఆ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నవారంతా ఒకవైపు లేకపోవడమే. సరిగ్గా ఇదే పాయింట్‌ను అస్త్రంగా మలచుకోవాలని విపక్ష కూటమి (I.N.D.I.A) భావిస్తోంది. బలీయమైన శక్తిగా ఎదిగి వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న బీజేపీకి బ్రేకులు వేయాలంటే.. బీజేపీని వ్యతిరేకించే ఓట్లన్నింటినీ ఒకచోటకు చేర్చాలని చూస్తోంది. అందులో భాగంగానే విపక్షాలన్నీ కలసికట్టుగా 400కు పైగా స్థానాల్లో బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలని చూస్తోంది. భిన్నాభిప్రాయాలు, బేధాభిప్రాయాలకు నిలయమైన విపక్ష కూటమిలో అగ్రనేతల మధ్య సయోధ్య సాధ్యపడినా క్షేత్రస్థాయిలో అది ఎంతవరకు ఫలిస్తుందన్నది ప్రశ్నార్థకమే. అందుకే ఎన్నికల్లో గణితశాస్త్ర సూత్రాలు వర్తించవని, 1+1=2 అవుతుందన్న గ్యారంటీ ఏమీ ఉండదని చెబుతుంటారు. ఈ విషయం పక్కనపెట్టి.. ఒకవేళ అర్థగణాంకాలు ఫలిస్తాయనే అనుకుందాం.

ఇదే సమయంలో గత పదేళ్లలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను, ప్రజల్లో పెంచుకుంటున్న ఆదరణను కూడా ఓసారి పరిశీలిద్దాం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 545 స్థానాలున్న లోక్‌సభకు బీజేపీ సొంతంగానే 282 స్థానాల్లో గెలుపొంది, మిత్రపక్షాల అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సంఖ్యాబలాన్ని సాధించింది. 2019 ఎన్నికల నాటికి బీజేపీ ఈ సంఖ్యను మరింత పెంచుకుని సొంతంగానే 303 సీట్లు సాధించింది. దేశవ్యాప్తంగా బీజేపీ సాధించిన ఓట్లు సగటున 37.36% కాబట్టి.. ఆ పార్టీ గెలిచిన చోట అభ్యర్థులకు అటూ ఇటూగా ఇదే నిష్పత్తిలో ఓట్లు వచ్చి ఉంటాయని, మిగతా పార్టీలన్నీ కలసికట్టుగా ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించితే బీజేపీని తుడిచిపెట్టేయవచ్చని అనుకుంటాం. ఇదే నిజమైతే బీజేపీ ఈసారి గెలుపొందడం అసాధ్యమనే చెప్పవచ్చు. కానీ అసలు తిరకాసు ఇక్కడే ఉంది. మొత్తం 545 స్థానాల లోక్‌సభలో ఎన్నికలు జరిగే 543 స్థానాలకు బీజేపీ పోటీ చేసింది 436 స్థానాల్లోనే. వాటిలో 303 గెలుపొందడం అంటే పోటీచేసిన స్థానాల్లో 70 శాతం గెలుపొందడం. ఇదొక లెక్కయితే.. గెలుపొందిన 303లో 224 సీట్లను ఏకంగా 50 శాతాన్ని మించిన ఓట్లతో గెలుపొందింది. అంటే 2019లోనే విపక్షాలన్నీ కలసికట్టుగా పోటీ చేసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించి, క్షేత్రస్థాయిలో కూడా తమ ఓట్లన్నింటీనీ ఉమ్మడి అభ్యర్థికి బదిలీ చేసినపక్షంలో బీజేపీని 224 సీట్లకు పరిమితం చేయగలిగేవి. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కనీస సంఖ్య 272కు 48 సీట్ల దూరంలో నిలపగలిగేది. అంటే సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిని కల్పించగలిగేది.

టార్గెట్ 50% – మిషన్ 400 ప్లస్

గతం పక్కనపెట్టి వర్తమానానికి వస్తే.. 2019 తరహాలో 50 శాతాన్ని మించిన ఓట్లతో గెలుపొందిన సీట్లను ఈసారి మరింత పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ క్రమంలోనే “మిషన్ 400 ప్లస్ – టార్గెట్ 50%” వంటి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2014 ఎన్నికల్లో 50 శాతాన్ని మించి గెలుపొందిన సీట్లు 136 ఉండగా, 2019 నాటికి ఆ సంఖ్య 224కు చేరింది. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచగలిగితే.. ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేయవచ్చు అన్నది కమలనాథుల వ్యూహం. 2014తో పోల్చితే బీజేపీ బలం క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది. సరికొత్త సామాజిక సమీకరణాలతో ఇన్నేళ్లుగా దూరమైన అనేక వర్గాలను ఆకట్టుకుంటోంది. ప్రత్యర్థుల కంచుకోటను సైతం బద్ధలుకొడుతోంది. ఎన్నికలను తమ జీవన్మరణ సమస్యగా మార్చుకుని గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతోంది. వారి గెలుపును ప్రభావితం చేసే భావోద్వేగపరమైన అంశాలు ఎలాగూ వారికి అస్త్రాలుగా మారతాయి. గత ఎన్నికల్లో పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత జరిపిన సర్జికల్ ఎయిర్ స్ట్రైక్స్ వంటి దేశభక్తి భావోద్వేగం ఉపయోగపడగా.. ఈసారి అయోధ్య రామమందిర నిర్మాణం, కాశ్మీర్‌ను భారత్‌లో పూర్తిస్థాయిలో అంతర్భాగంగా చేస్తూ ఆర్టికల్ 370 అధికరణను రద్దు చేయడం వంటి భావోద్వేగాంశాలు ఉన్నాయి. వాటికి తోడు ప్రపంచపటంపై భారతదేశ స్థాయి, గౌరవ ప్రతిష్టలు మరింత పెరిగాయి. దేశీయంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సామాన్యులను పట్టిపీడించే సమస్యలు ఎన్ని ఉన్నా.. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందుతోంది. ఆర్థిక, ఆహార సంక్షోభంలో అగ్రరాజ్యాలు సైతం చిక్కుకున్నా దేశాన్ని ఏ సంక్షోభంలోనూ చిక్కుకోకుండా ముందుకు నడిపించగలిగిన ఘనత తమదేనని బీజేపీ చెప్పుకుంటోంది. వీటితో పాటు వివిధ వర్గాలను ఆకట్టుకునే పీఎం-విశ్వకర్మ, ముద్ర యోజన వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లు, వేగవంతమైన వందేభారత్ రైళ్లు, పెరిగిన విమానాశ్రయాలు, సామాన్యుడికి అందుబాటులో విమాన ప్రయాణం వంటివి కూడా గత పదేళ్లలో సాధించిన విజయాలుగా ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఈ అభివృద్ధి, సంక్షేమం ఓటర్లను ఎంతమేర కట్టిపడేస్తుందన్న చెప్పలేకపోయినా.. భావోద్వేగాలతో ముడిపడ్డ అంశాలు మాత్రం కచ్చితంగా ఓటర్లను ఒకవైపు పోలరైజ్ చేయగల్గుతాయి. ఆ విషయంలో బీజేపీ మాస్టర్.

ఇవన్నీ పక్కనపెడితే.. ప్రతిపక్షాలు తమ ప్రధాని అభ్యర్థి విషయంలోనే అంతర్గతంగా కుమ్ములాడుకుంటున్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనే మిత్రపక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోయాయి. పైగా ఈ రాష్ట్రాల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణులకు సరికొత్త ఉత్సాహాన్ని, నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రతిపక్ష పార్టీల నేతలు చేతులు కలిపినంత సులభంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేతులు కలిపే పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లో లేవు. ఢిల్లీ, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రత్యర్థులుగా ఉన్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్ సహా చాలా చోట్ల కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రత్యర్థులుగా ఉన్నారు. దాదాపు ఇదే పరిస్థితి ఇతర మిత్రపక్ష పార్టీలతోనూ ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా 400కు పైగా స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టినా.. ఆ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బతీసే రెబెల్ అభ్యర్థులు ఎలాగూ ఉంటారు. ఈ అంతర్గత సమస్యలన్నింటినీ సరిదిద్దుకున్నా సరే.. 2019లో 224 స్థానాల్లో 50 శాతం మించి ఓట్లు సాధించిన బీజేపీని, అత్యధిక జనాభా, అత్యధిక లోక్‌సభ సీట్లు కల్గిన హిందీ రాష్ట్రాల్లో నిలువరించడం విపక్షాలకు అంత సులభమేమీ కాదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..