కరోనా కట్టడికి వ్యాక్సినేషనే వజ్రాయుధం.. వివిధ మంత్రిత్వశాఖల ఉన్నతాధికారుల భేటీలో ప్రధాని మోదీ
కరోనా సెకండ్ వేవ్ మహోగ్రరూపం దాల్చింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారత్‌పై పంజా విసురుతోంది. లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవున్నాయి. వేలా..
కరోనా సెకండ్ వేవ్ మహోగ్రరూపం దాల్చింది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారత్‌పై పంజా విసురుతోంది. లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో కేంద్రం అప్రమత్తమయింది. కరోనా కట్టడి దిశగా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. దేశంలో కరోనా వ్యాప్తి, కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశానికి సిద్ధమయ్యారు. సోమవారం పలు శాఖల మంత్రులు, నీతిఆయోగ్ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి, మెడిసిన్స్, ఆక్సిజన్, వెంటిటేటర్స్, వ్యాక్సినేషన్ సహా పలు వివరాల గురించి అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్న కరోనా కేసుల పరిస్థితిపై సమీక్షించారు. అలాగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించారు. మరో వైపు దేశంలో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కోవిడ్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న చాలా రాష్ట్రాల్లో ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోయాయి. దీంతో మెడికల్ ఆక్సిజన్ కొరత, రెమ్‌డిసివిర్ ఔషధంతో పాటు వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. ఈ సమయంలో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత కొన్ని రోజులుగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్రధాని మోదీ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసే ట్యాంకర్లు ఎలాంటి ఆటంకం లేకుండా 24 గంటలు ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. ఇక వైరస్ కట్టడి చర్యలను తప్పకుండా అమలు చేయాలని, టెస్టింగ్, ట్రాకింగ్, చికిత్సలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రాలు మరింత వేగవంతం చేయాలని మోదీ అన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య తీవ్రంగా ఉన్నందున రాష్ట్రాలు మరింత అప్రమత్తమైన చర్యలు చేపట్టాలని సూచించారు.