‘షారుఖ్ దోస్త్ కూడా భయపడిపోయాడట’.. ఇదో ఢిల్లీ క్రైమ్ కహానీ

ఢిల్లీ అల్లర్ల సందర్భంగా గత ఫిబ్రవరి 24 న ఓ పోలీసుపై గన్ ఎక్కుపెట్టి..బెదిరించి పారిపోయిన యువకుడు షారుఖ్  అప్పటినుంచి ఎక్కడెక్కడ తిరిగాడో, ఏం చేశాడో పోలీసులు తెలిపారు.

'షారుఖ్ దోస్త్ కూడా భయపడిపోయాడట'.. ఇదో ఢిల్లీ క్రైమ్ కహానీ
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Mar 07, 2020 | 5:10 PM

ఢిల్లీ అల్లర్ల సందర్భంగా గత ఫిబ్రవరి 24 న ఓ పోలీసుపై గన్ ఎక్కుపెట్టి..బెదిరించి పారిపోయిన యువకుడు షారుఖ్  అప్పటినుంచి ఎక్కడెక్కడ తిరిగాడో, ఏం చేశాడో పోలీసులు తెలిపారు. ఆ పిస్టల్ ని వారు శుక్రవారం అతని ఇంటినుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాటు స్పాట్ నుంచి పారిపోయేందుకు ఇతగాడు వాడిన కారును కూడా తాము స్వాధీనం చేసుకున్నట్టు వారు చెప్పారు. ‘అది ఫిబ్రవరి  24 వ తేదీ.. సిఏఏకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సందర్భమది ! ఆ రోజున తనను పట్టుకోవడానికి వఛ్చిన ఓ పోలీసుపై గన్ ఎక్కుపెట్టాడు. ఒకసారి కాల్పులు జరపగా తూటా ఆ పోలీసు ఎడమ వైపునుంచి దూసుకుపోయింది.

షారుఖ్ మళ్ళీ గాల్లోకి రెండు సార్లు కాల్పులు జరిపి అక్కడినించి పరారయ్యాడు. కారులో మొదట పంజాబ్ కి, ఆ తరువాత యూపీలోని షామ్లీ ప్రాంతానికి వెళ్ళాడట. (అక్కడే అతడిని గత మంగళవారం అరెస్టు చేశారు). మొదట ఫిబ్రవరి 24 న తన ఇంటికి వెళ్ళినప్పుడు.. పోలీసుపై తను గన్ ఎక్కుపెట్టిన దృశ్యాలు టీవీలో పదేపదే ప్రసారమవుతుండడంతో.. గాభరా పడి  బట్టలు మార్చుకుని ఢిల్లీలో మారుమూలన గల హౌజ్ ఖాస్ ప్రాంతానికి చేరుకొని క్లబ్బుల్లో తలదాచుకున్నంత పని చేశాడు. ఆ మరుసటి రోజున కన్నాట్ ప్లేస్ లో కారును పార్క్ చేసి అందులోనే నిద్రపోయాడని, అనంతరం పంజాబ్ లోని జలంధర్ కి వెళ్లి తన మిత్రుని సాయం కోరగా.. అప్పటికే టీవీలో ఇతగాని నిర్వాకం చూసి ఆ ‘దోస్త్’ కనీసం కలుసుకోవడానికి కూడా నిరాకరించాడని తెలిసింది. పంజాబ్ లో బస్సుల్లో తిరుగుతూ వఛ్చిన షారుఖ్ మళ్ళీ యూపీలోని షామ్లీకి చేరుకోగా అక్కడి బస్టాండ్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. తను వాడిన కారు తనది కాదని, అది తన అంకుల్ కి చెందినదని షారుఖ్ చెప్పాడు. ఇతడ్ని ఖాకీలు నాలుగు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్నారు. ఇతని తండ్రి డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడి.. అనంతరం బెయిలుపై విడుదలయ్యాడట. మొత్తానికి తండ్రీ కొడుకుల క్రిమినల్ హిస్టరీ ఢిల్లీ పోలీసులకు షాకిచ్చింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu