
సాధారణంగా మనం బస్సు ప్రయాణం కంటే కూడా రైలు ప్రయాణానికే ఎక్కువగా ఇష్టపడతాం. సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు, భోజనం తదితర సేవలు అందుబాటులో ఉండటమే ప్రధాన కారణం. అందులోనూ 60 ఏళ్లు పైబడిన వాళ్లకైతే దీనికి మించిన ప్రత్యమ్నాయ ప్రయాణం వేరొకటి ఉండదు. అందుకే పెద్దవాళ్లు, పిల్లలతో ప్రయాణం చేసే కుటుంబాలు రైలుకే అధిక ప్రాధాన్యత ఇస్తాయి. అయితే ఇటీవల రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న వృద్ద దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. తాము రిజర్వేషన్ చేసుకున్న కోచ్ లో ప్రయాణిస్తున్నప్పటకీ టికెట్ కలెక్టర్ అది చెల్లదని జరిమానా విధించారు. గద్యంతరం లేక ఫైన్ చెల్లించారు. ఇంతటితో ఈ ఘటనకు ఎండ్ కార్డ్ పడలేదు. కొత్త మలుపు తిరిగి రైల్వే శాఖకు భారీ జరిమానా విధించబడింది.
బెంగళూరు లోని వైట్ ఫీల్డ్ లో నివాసం ఉంటున్న అలోక్ కుమార్ 70 ఏళ్లు పైబడిన తమ తల్లిదండ్రులకు ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేశారు. అయితే టికెట్ చెకింగ్ కోసం వచ్చిన అధికారులకు ఆ టికెట్ చూపించారు వృద్ద దంపతులు. అందులోని పీఎన్ఆర్ నంబర్ మ్యాచ్ అవ్వలేదని ఈ టికెట్ చెల్లుబాటు కాదన్నారు టీసీ. పైగా ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిలో ప్రయాణిస్తున్న వారికి రూ.22,300 జరిమానా విధించారు. ఈ విషయాన్ని తమ కుమారునికి తెలుపగా అలోక్ సౌత్ వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఎంతకీ స్పందించకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఈ సంఘటనపై స్పందించిన వినియోగదారీ ఫోరం అధికారులు చీఫ్ బుకింగ్ ఆఫీసర్ తో పాటు ఐఆర్సీటీసీ అధికారుల లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రైలులో ప్రయాణిస్తున్న వృద్ద దంపతులకు జరిగిన అసౌకర్యానికి రూ. 40,000 నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలతో అలోక్ కుమార్ కి నష్టపరిహారాన్ని చెల్లించారు రైల్వే అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..