Congress Working Committee: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యం.. ఎందుకిలా..?

| Edited By: Shaik Madar Saheb

Dec 29, 2024 | 7:53 PM

గత పదేళ్లలో దేశంలో 2 పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికలు జరగ్గా, 53 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ 2 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోగా, 40కి పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. కొన్ని రాష్ట్రాల్లో గెలుపొందినప్పటికీ.. అది కాంగ్రెస్ ఘనత కాదని, అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలపై ఏర్పడ్డ వ్యతిరేకత గెలిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Congress Working Committee: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యం.. ఎందుకిలా..?
Congress Working Committee
Follow us on

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఆ పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక విభాగం. అందులో తీసుకున్న నిర్ణయాలు పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు శిరోధార్యం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసేది కూడా ఈ వర్కింగ్ కమిటీయే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సైతం తొలుత CWC లో తీర్మానం పెట్టి, ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాతనే ప్రభుత్వపరంగా అడుగులు పడ్డాయి. అలాంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నేడు ప్రహసనంగా మారిపోయాయి. తాజాగా కర్ణాటకలో బెళగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీని పునాదుల నుంచి పునరుద్ధరించాలని తీర్మానించింది. ప్రారంభోపన్యాసంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ 2025 సంవత్సరం కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే సంవత్సరం అని సూత్రీకరించారు. 2025లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ నిర్మాణంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. కార్యకర్తలను క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉంచేందుకు పార్టీ సంవిధాన్ యాత్రను ప్రారంభించనుంది. అయితే, సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) పాలన 2014లో ముగిసిన తర్వాత కాంగ్రెస్ ఇప్పటి వరకు 24 CWC సమావేశాలు నిర్వహించింది. ఈ పదేళ్లలో ఆ పార్టీ 40కి పైగా ఎన్నికల్లో ఓటమిపాలైంది.

  • 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మే నెలలో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 24 సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. 2014 మే తర్వాత అదే ఏడాది నవంబర్‌లో CWC సమావేశం జరిగింది.
  • 2015లో 2 CWCలు (జనవరి, సెప్టెంబర్), 2016లో 2 (ఏప్రిల్, నవంబర్), 2017లో 2 (నవంబర్, డిసెంబర్), 2018లో 3 (జూలై, ఆగస్టు, అక్టోబర్), 2019లో 3 (మార్చి, మే, ఆగస్టు) సమావేశాలు జరిగాయి.
  • 2020లో ఆగస్టు నెలలో CWC సమావేశం జరిగింది. కరోనా మహమ్మారి, కోవిడ్-19 ఆంక్షల నేపథ్యంలో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నిర్వహించింది. 2021 ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో వర్కింగ్ కమిటీ సమావేశమైంది. 2022లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండు సమావేశాలు జరిగాయి, ఒకటి మార్చిలో మరియు మరొకటి ఆగస్టులో జరిగింది.
  • 2023లో కూడా CWC రెండు సమావేశాలు జరిగాయి. 2024లో ఇప్పటివరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొత్తం 4 పర్యాయాలు సమావేశమైంది.

ఈ CWC సమావేశాల్లో ఏం జరిగింది?

మే 2014 సమావేశంలో, ఓటమిని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ మేరకు AK ఆంటోనీ అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పాటైంది. కానీ ఆ కమిటీ నివేదికను బహిర్గతం చేయలేదు. అందులో పొందుపర్చిన సూచనలు, సిఫార్సులను అమలు చేయడానికి కూడా ఎటువంటి చొరవ తీసుకోలేదు. ఆంటోనీ కమిటీ తన నివేదికలో సంస్థాగతంగా భారీ మార్పుల గురించి ప్రస్తావించింది.

2018లో వార్ధాలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగాలని చెప్పారు. 2019లో ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఇదే తరహా చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడం గురించి ఆలోచించాలని అన్నారు. గాంధీ కుటుంబం నుంచి పార్టీ సారధ్య బాధ్యతలను ఇప్పుడు ఎవరూ చేపట్టరని కూడా ఆయన ప్రకటించారు.

మార్చి 2022 సమావేశంలో కూడా పార్టీ సంస్థాగత నిర్మాణమే ప్రధాన ఎజెండా అయింది. పార్టీని పునరుద్ధరించేందుకు మేధోమథన శిబిరం నిర్వహించాలని కూడా నిర్ణయించింది. ఆ ఏడాది మే 2022లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో శిబిరాన్ని ఏర్పాటైంది. ఉదయ్‌పూర్‌లో పార్టీ బలోపేతం చేయడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ నేటి వరకు ఏ ఒక్క నిర్ణయం అమలు కాలేదు.

పదేళ్లలో 55 ఎన్నికలు, 40 ఎన్నికల్లో ఓటమి

గత పదేళ్లలో దేశంలో 2 పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికలు జరగ్గా, 53 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ 2 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోగా, 40కి పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. కొన్ని రాష్ట్రాల్లో గెలుపొందినప్పటికీ.. అది కాంగ్రెస్ ఘనత కాదని, అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలపై ఏర్పడ్డ వ్యతిరేకత, మరో ప్రత్యామ్నాయం లేకపోవడమే కాంగ్రెస్ పార్టీని గెలిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే గెలిచినవాటిలో 2017లో పంజాబ్‌, 2018లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, 2022లో హిమాచల్‌ ప్రదేశ్‌, 2023లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో సొంతంగా కాంగ్రెస్‌ విజయం సాధించింది. కూటమిగా మిత్రపక్షాలతో కలిసి జార్ఖండ్‌లో రెండుసార్లు, తమిళనాడులో ఒకసారి, మహారాష్ట్రలో కొన్నాళ్లు కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. మహారాష్ట్రలో మూడుసార్లు, హర్యానాలో మూడుసార్లు, ఢిల్లీలో మూడుసార్లు కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఓడిపోయింది. యూపీ, బీహార్, బెంగాల్ సహా 12 రాష్ట్రాల్లో ఆ పార్టీ రెండుసార్లు ఓటమి చవిచూసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..