Priyanka Gandhi: రాజకీయాల్లో టైమింగ్‌ ముఖ్యం.. అదను చూసి అస్త్రాలను ప్రయోగిస్తున్న కాంగ్రెస్..!

|

Jun 19, 2024 | 10:25 AM

ప్రచారం లోనే కాదు.. పార్లమెంట్‌లో కూడా అన్నకు తోడుగా ఉండాలని డిసైడ్‌ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కేరళలోని వయనాడు నుంచి ప్రియాంక పోటీకి దిగడం కాంగ్రెస్‌కు అన్ని విధాలా కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Priyanka Gandhi: రాజకీయాల్లో టైమింగ్‌ ముఖ్యం.. అదను చూసి అస్త్రాలను ప్రయోగిస్తున్న కాంగ్రెస్..!
Rahul Gandhi Priyanka Gandhi
Follow us on

ప్రచారం లోనే కాదు.. పార్లమెంట్‌లో కూడా అన్నకు తోడుగా ఉండాలని డిసైడ్‌ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కేరళలోని వయనాడు నుంచి ప్రియాంక పోటీకి దిగడం కాంగ్రెస్‌కు అన్ని విధాలా కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మీద రాహుల్‌గాంధీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టడానికి సమయం దొరుకుతుందని చెబుతున్నారు.

రాజకీయాల్లో టైమింగ్‌ ముఖ్యం.. ఓపిక, సహనం చాలా అవసరం.. బీజేపీ చేతిలో వరుసదెబ్బలు తిన్న తరువాత కాంగ్రెస్‌ నేర్చుకున్న గుణపాఠం ఇది.. ఇప్పడు అదను చూసి కాంగ్రెస్‌ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ప్రియాంకాగాంధీ వయనాడు నుంచి ఎన్నికల బరి లోకి దిగడం ఇందులో భాగంగానే చెప్పుకోవాలి.. తల్లి వారసత్వంగా రాయ్‌బరేలి సీటుకు ప్రాతినిధ్యం వహించాలని రాహుల్‌గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అన్న వారసత్వంగా ఇచ్చిన వయనాడు సీటు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు ప్రియాంక. వయనాడు నుంచి ప్రియాంక గెలుపు నల్లేరు మీద నడకే అన్న భావన కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉంది. 2019లో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. కాని ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటారు .

ఉత్తరప్రదేశ్‌ ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు ప్రియాంక గాంధీ. ముఖ్యంగా తమ కుటుంబానికి కంచుకోటలైన రాయ్‌బరేలి , అమేథీ సీట్లలో గెలుపు కోసం అహర్నిశలు పాటు పడ్డారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబం విధేయుడు కిశోరిలాల్‌ శర్మ గెలుపులో ప్రియాంకదే ప్రధాన పాత్ర. 2019లో అమేథీలో రాహుల్‌ ఓటమికి ప్రియాంక ఇలా ప్రతీకారం తీర్చుకున్నారు. 2022లో ప్రియాంక కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌ ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. కాని 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 2 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. అయినప్పటికి నిరాశ చెందలేదు ప్రియాంక. యూపీ ప్రజల కష్టాలపై ఎప్పటికప్పుడు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం కొనసాగించారు. ఆ పోరాటమే లోక్‌సభ ఎన్నికల్లో కలిసివచ్చింది. యూపీలో 6 ఎంపీ సీట్లను కాంగ్రెస్‌ గెల్చుకుంది.

2029 ఎన్నికలకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఇప్పటినుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తోంది. పార్టీ అధికారం లోకి రావాలంటే యూపీ కీలకం. అందుకే రాయ్‌బరేలి నుంచి ఎంపీగా కొనసాగాలని రాహుల్‌ నిర్ణయించుకున్నారు. దక్షిణాదిలో పార్టీ వ్యవహారాలను ప్రియాంక చూసుకునే అవకాశం ఉంది. చూడడానికి నాయనమ్మ ఇందిరగాంధీ పోలికలతో ఉండే ప్రియాంకకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఒంటి చేతితో గెలిపించారు ప్రియాంక. కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుడిగాలి ప్రచారం చేసి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

20 ఏళ్ల నుంచి తనకు రాయ్‌బరేలి, అమేథీ ప్రజలతో అనుబంధం ఉందన్నారు ప్రియాంక. వాస్తవానికి ఆమె రాయ్‌బరేలి నుంచి ఈసారి పోటీ చేస్తారని అందరూ భావించారు. కాని రాహుల్‌గాంధీ అక్కడ పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే వయనాడు నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తున్నా.. రాహుల్‌గాంధీ స్థానాన్ని భర్తీ చేస్తా.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తా. రాయ్‌బరేలితో ఎంతో అనుబంధం ఉంది. 20 ఏళ్లుగా రాయ్‌బరేలి, అమేథీ ప్రజలను కలుస్తున్నా.. ఆ అనుబంధం ఎప్పటికి కొనసాగుతుంది. రాయ్‌బరేలిలో మేమిద్దరం ఉంటాం.. వయనాడులో కూడా మేమిద్దరమే ఉంటాం అని ప్రియాంక గాంధీ అన్నారు.

అన్న రాహుల్‌కు తోడుగా నిలబడుతున్నారు ప్రియాంక. కేవలం ప్రచారం చేస్తే సరిపోదని, చట్టసభల్లో తన వాణిని విన్పించాలని ప్రియాంకను కోరినట్టు చెప్పారు ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా. ఎంపీగా ఆమె తప్పకుండా సక్సెస్‌ అవుతారని ఆయన అన్నారు. ప్రియాంకను ఎంపీగా చూడాలని అనుకుంటున్నా.. ఈసారి తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పా.. ప్రచారం మాత్రమే చేస్తే సరిపోదని, ఎంపీగా ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పానన్నారు ఆమె చాలా కష్టపడుతారు.. ప్రజా సమస్యలను ముఖ్యంగా మహిళల కష్టాలను సభలో తప్పకుండా ప్రస్తావిస్తారన్నారు. పోరాటానికి ఆమె ప్రతిరూపం. పార్లమెంట్‌ ఎంపీగా రాణిస్తారు.. దేశానికి చక్కని సేవలను అందిస్తారన్నారు.

మొత్తానికి ప్రియాంకాగాంధీ తొలిసారి ఎన్నికల బరి లోకి దిగడంతో వయనాడు ఎంపీ స్థానానికి ఉపఎన్నిక హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..