రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రైల్వేలు.. ఆదాయంలోనూ దూసుకుపోతున్నాయి. నిత్యం లక్షల కొద్దీ ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చే భారతీయ రైల్వే ఆదాయ సముపార్జనలోనూ పురోగతి సాధిస్తోంది. గడిచిన ఆరు నెలల కాలంలో రూ.33 వేల కోట్లకు పైగా రైల్వేకు ఆదాయం పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 వరకు రైల్వేలకు దాదాపు రూ.33,476 కోట్లు ఆదాయం సమకూరినట్టు భారతీయ రైల్వే వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో ప్యాసింజర్ రెవెన్యూ రూ.17,394 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది అది రెట్టింపుకు పెరగడం గమనార్హం. రిజర్వేషన్ చేయించుకొని 42.89 కోట్ల మంది ప్రయాణికులు రైల్వేల్లో ప్రయాణం చేశారు. వారి ద్వారా రైల్వేలకు రూ.26,961కోట్లు ఆదాయం సమకూరినట్టు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఇది 65 శాతం అధికమని తెలిపింది. అన్ రిజర్వుడు ప్యాసింజర్ల కేటగిరీలో 268.56 కోట్లు మంది రైల్వేల్లో ప్రయాణించగా.. ఈ ఏడాది ఈ సంఖ్య 197శాతం పెరిగినట్టు వివరించింది. ఈ విభాగంలో ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 వరకు రైల్వేలకు రూ.6,515 కోట్ల ఆదాయం సమకూరగా.. గతేడాది రూ.1,086కోట్లు మాత్రమే వచ్చింది.
కాగా.. పండుగలు, పర్వదినాలు, సెలవుల సందర్భంగా రైళ్లల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. అంతే కాకుండా ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడిపించారు. దసరా పండుగ సందర్భంగా ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మహారాష్ట్రలోని పూర్ణ రైల్వే జంక్షన్ – తిరుపతికి మధ్య ఈ నెల 11 తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడపిస్తోంది.
పూర్ణ నుంచి తిరుపతికి 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నపడనుండగా.. తిరుపతి నుంచి పూర్ణకు 12, 19, 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రోజుల్లో పూర్ణ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 1 గం.కు బయలుదేరే ప్రత్యేక రైలు.. మరుసటి రోజు ఉదయం 8 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది.