Coimbatore Blast Updates: కోయంబత్తూరు పేలుడు ఘటనలో సంచలనాలు.. శ్రీలంక పేలుళ్లతో లింక్..

|

Oct 25, 2022 | 4:20 PM

తమిళనాడులోని కోయంబత్తూరు కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 2019లో శ్రీలంక బాంబు పేలుళ్లకు, ఆదివారం తమిళనాడులోని..

Coimbatore Blast Updates: కోయంబత్తూరు పేలుడు ఘటనలో సంచలనాలు.. శ్రీలంక పేలుళ్లతో లింక్..
Coimbatore Bomb Blast
Follow us on

తమిళనాడులోని కోయంబత్తూరు కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 2019లో శ్రీలంక బాంబు పేలుళ్లకు, ఆదివారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన బాంబు దాడికి లింకులు కనిపిస్తున్నాయి. కోయంబత్తూరు పేలుడులో చనిపోయిన జమీషా మొబిన్‌ అనే వ్యక్తి, పేలుడుకు రెండు రోజుల ముందు కేరళలోని త్రిసూరు జైల్లో ఉన్న అజారుద్దీన్‌ అనే వ్యక్తిని కలిసినట్టు తెలుస్తోంది. 2019లో జరిగిన శ్రీలంక బాంబు పేలుళ్ల కేసులో అజారుద్దీన్‌ నిందితుడిగా ఉన్నారు. మరో వైపు ఈ పేలుడుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజారుద్దీన్‌, మొబిన్‌ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని తెలుస్తోంది.

పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు యువకులకు ఈ పేలుడులో చనిపోయిన మొబిన్‌తో సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడుకు అవసరమైన పదార్థాలు సేకరించే పనిలో ఈ యువకులున్నట్టు తెలుస్తోంది. మొబిన్‌ ఇంటి దగ్గర ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన ఒక బలమైన వస్తువును వీరు తరలిస్తున్నట్టు సీసీ టీవీల్లో రికార్డైంది.

2019లో శ్రీలంకలో ఈస్టర్‌ రోజున జరిగిన పేలుళ్ల తరహాలోనే కోయంబత్తూరులోనూ పేలుళ్లకు కుట్ర పన్నినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కోయంబత్తూరు పేలుడులో చనిపోయిన ఇరవై ఏళ్ల జమీషా మొబిన్‌ను ఐసిస్‌కు సంబంధించిన 2019లో ఎన్ఐఏ ప్రశ్నించింది. శ్రీలంకలో దాడులకు సూత్రధారి అయిన ఇస్లామ్‌ మతాధికారి జహ్రాన్‌ హషీమ్‌కు మొబిన్‌ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌.

ఇవి కూడా చదవండి

కాగా, దీపావళి ముందు రోజు తమిళనాడు కోయంబత్తూరులో కారులో సిలిండర్‌ పేలుడు సంభవించింది. అక్టో్బర్ 23న ఉదయం 4 గంటల ప్రాంతంలో కోయంబత్తూరులోని కొట్టే సంగమేశ్వర ఆలయం ముందు స్పీడ్‌ బ్రేకర్‌ దగ్గరకు రాగానే మారుతి కారులో పేలుడు జరిగింది. సిలిండర్‌ పేలిన ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ సిబ్బంది పేలుడు సంభవించిన ప్రాంతానికి వచ్చి కారు మంటలను ఆర్పేశారు. కారులో కాలిపోయిన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే, పేలుడు సంభవించిన ప్రాంతంలో బేరింగ్‌ బాల్స్‌, గాజుపెంకులు, అల్యూమినియం మేకులు కనిపించండంతో అనుమానానికి తావిచ్చింది. దాంతో ఈ పేలుడుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..