మసీదులో హనుమాన్ చాలీసా, గాయత్రి మంత్రం చదివినందుకు జరిమానా!
మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం, గాయత్రీ మంత్రం జపం చేసిన వ్యక్తి బాగానే ఉన్నాడు కానీ.. అందుకు అనుమతినిచ్చిన మసీదు పెద్దలకే చిరిగి చాటయ్యింది..
మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం, గాయత్రీ మంత్రం జపం చేసిన వ్యక్తి బాగానే ఉన్నాడు కానీ.. అందుకు అనుమతినిచ్చిన మసీదు పెద్దలకే చిరిగి చాటయ్యింది.. మసీదు కమిటీ పెద్దలు పది లక్షల జరిమానా విధించి వెంటనే కట్టేయమన్నారు.. ఈ సంఘటన జరిగింది ఉత్తరప్రదేశ్‌లో! అసలు జరిగిదేమిటంటే.. ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్ అనే పట్టణం ఉంది.. అక్కడ వినయ్‌పూర్ అనే లొకాలిటీలో ఓ మసీదు ఉంది.. ఆ మసీదుకు అలీ హసన్ గార్డియన్‌గా వ్యవహరిస్తున్నారు.. అంటే హఫీజ్ అన్నమాట! స్థానికంగా ఉండే బీజేపీ నాయకుడు మనుపాల్ భన్సాల్‌తో అలీ హసన్‌కు పరిచయం ఉంది.. మనుపాల్ భన్సాల్ జనసంఖ్య సమాధాన్ ఫౌండేషన్‌కు నేషనల్ ప్రెసిడెంట్ కూడా! ఓ రోజు అలీహసన్ దగ్గరకు వచ్చిన మనుపాల్ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమం కోసం మసీదులో కూర్చోడానికి పర్మిషన్ అడిగాడు.. దాందేముంది .. హాయిగా కూర్చోవచ్చన్నాడు అలీ హసన్.. కార్యక్రమంలో మొదలవ్వగానే మనుపాల్ భన్సాల్ హనుమాన్ చాలీసా పారాయణం చేశాడు.. ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించాడు.. ఇదంతా జరుగుతున్నప్పుడు మసీదు కమిటీ పెద్దలు గమ్మునున్నారు.. అంతా అయ్యాక మాత్రం అలీ హసన్‌పై సీరియస్ అయ్యారు.. హసన్ అలీని, మనుపాల్‌భన్సాల్‌ను పిలిచి పంచాయతీ పెట్టారు.. చేసిన తప్పిదానికి ఇద్దరూ చెరో అయిదు లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనన్నారు.. పాపం వారు మాత్రం ఏం చేస్తారు? కమిటీ చెప్పిన కాగితాలపై సంతకాలు చేసి వచ్చేశారు.. మనుపాల్ తన దగ్గరకు వచ్చిన మసీదు లోపల కూర్చోడానికి పర్మిషన్ అడిగాడని, కాదని ఎలా చెప్పగలనని అలీ హసన్ తెలిపాడు.. భగవంతుడి సన్నిధిలో కూర్చొనే హక్కు అందరికీ ఉంటుందని అంటున్నాడు అలీ.. మసీదు నుంచి బయటకు పంపేసిన తర్వాత అలీ హసన్ ఘజియాబాద్ జిల్లాలోని తన సొంత పట్టణమైన లోనికి వెళ్లిపోయాడు.. ఇదిలా ఉంటే ఇద్దరు యువకులు ఇందుకు ప్రతిగా మధుర ఆలయంలో నమాజ్ చదివారట! ఇవన్నీ మత ఘర్షణలకు దారి తీస్తాయేమోనని పోలీసులు ముందు జాగ్రత్తగా అందరిని అదుపులోకి తీసుకున్నారు. అలీ హసన్, తాను కలిసి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటాలనే ప్రయత్నం చేశామని చెబుతున్నాడు మనుపాల్ భన్సాల్..