హాస్టల్‌లో గిరిజన విద్యార్థిని పట్ల అమానుషం.. ఆ అనుమానంతో మెడలో బూట్ల దండ వేసి.. ఊరేగించి..
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. డబ్బు దొంగించిందనే అనుమానంతో హాస్టల్ మహిళా సూపరింటెండెంట్.. గిరిజన బాలిక పట్ల అమానుషంగా వ్యవహరించింది.
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. డబ్బు దొంగించిందనే అనుమానంతో హాస్టల్ మహిళా సూపరింటెండెంట్.. గిరిజన బాలిక పట్ల అమానుషంగా వ్యవహరించింది. మహిళా సూపరింటెండెంట్ 5వ తరగతి విద్యార్థిని మెడలో బూట్ల దండ వేసి ఊరేగించిన ఘటనపై మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. గత వారం బేతుల్ జిల్లాలోని దామ్‌జీపురా గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ అమన్‌వీర్ సింగ్ బైన్స్‌కు సమాచారం అందించడంతో వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి నుండి రాతపూర్వక ఫిర్యాదును స్వీకరించిన తర్వాత కలెక్టర్ బెయిన్స్ మాట్లాడుతూ.. విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. దోషులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
ఇదిలా ఉండగా, మహిళా సూపరింటెండెంట్‌ను ఆ పదవి నుంచి తొలగించినట్లు గిరిజన వ్యవహారాల శాఖ అధికారి ఒకరు తెలియజేసినట్లు పీటీఐ నివేదించింది. దామ్‌జీపురాలోని హాస్టల్ గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. తల్లి.. తన కుమార్తెను కలవడానికి వెళ్లినప్పుడు ఆమె తనకు ఎదురైన కష్టాలను వివరించినట్లు బాలిక తండ్రి తెలిపారు. హాస్టల్ మేట్ నుంచి రూ.400 దొంగిలించారని, అందుకు శిక్షగా ఆమె ముఖానికి నల్ల సిరాతో మేకప్ వేసి దెయ్యంలా కనిపించేలా చేశారని.. ఆ తర్వాత బూట్ల దండతో హాస్టల్ క్యాంపస్‌లో బలవంతంగా ఊరేగించారని బాలిక తండ్రి ఆరోపించారు. తనకు ఎదురైన ఈ సంఘటన తర్వాత తన కుమార్తె హాస్టల్‌లో ఉండటానికి ఇష్టపడటం లేదని ఆమె తండ్రి చెప్పారు.
ఫిర్యాదు అందిన తర్వాత హాస్టల్ సూపరింటెండెంట్‌ను పోస్ట్ నుండి తొలగించి విచారణకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని గిరిజన వ్యవహారాల శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిల్పాజైన్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..