ఘజియాబాద్, అక్టోబర్ 30: ఆ కోర్టులో వాదప్రతివాదనలు సీరియస్‌గా జరుగుతున్నాయి. జడ్జి, లాయర్లు మధ్య మటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. అంతే.. ఒక్కసారిగా కోర్టు వాతావరణం మారిపోయింది. కోర్టు హాలులో అధిక సంఖ్యలో లాయర్లు ఉండటంతో వారంతా జడ్జి చాంబర్‌ను చుట్టుముట్టి దాడికి యత్నించారు. దీంతో తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ ముష్టియుద్ధానికి దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు. ఈ ఘటనలో పలువురు లాయర్లు గాయపడ్డారు. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన ఓ కేసులో బెయిల్ నిరాకరించడంతో లాయర్లు, జడ్జి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం వల్ల ఈ ఘటన జరిగింది. ఘజియాబాద్ జిల్లా కోర్టులో పోలీసులు, లాయర్ల మధ్య జరిగిన ఘర్షణ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
యూపీలోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో జడ్జి, లాయర్ల మధ్య వాగ్యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన ఓ కేసులో ఈ వివాదం చోటు చేసుకుంది. పెద్ద యెత్తున వచ్చిన లాయర్లు, జడ్జి చాంబర్‌ను చుట్టుముట్టడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో కోర్టు రూములోని కుర్చీలను విసురుకుంటూ నానారచ్చ చేశారు.
Kalesh b/w lawyers and judge in Ghaziabad, UP court ;Judge called police. Police chased the lawyers out of the court room, happened during the hearing of a case)
pic.twitter.com/UchpJzDik2— Ghar Ke Kalesh (@gharkekalesh) October 29, 2024
పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారందరినీ చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిపై ఆగ్రహించిన న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. జడ్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ఆవరణలోని పోలీస్ ఔట్‌పోస్ట్‌ను సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాత న్యాయమూర్తులందరూ కోర్టులో పనిచేయడం నిలిపివేశారు. బార్ అసోసియేషన్ సమావేశానికి హాజరుకావాలని చర్చలకు పిలిచారు. ఈ ఘటనపై ఘజియాబాద్ అదనపు పోలీసు కమిషనర్ దినేష్ కుమార్ పి మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఛాంబర్ లోపల లాయర్లు చాలా మంది ఉన్నారు. బెయిల్‌ను బదిలీ చేయాలని ఒక న్యాయవాది డిమాండ్ చేశారు. దానిని జడ్జి తిరస్కరించడం వల్ల వాగ్వాదం చోటు చేసుకుందని ఆయన తెలిపారు.