AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో అసలు కథ ముందుందా? సీబీఐ తాజా ఛార్జ్‌షీట్‌లో కీలక వ్యక్తుల పేర్లు..

ఢిల్లీ లిక్కర్‌ కేసు కథ ఇంకా ముగిసిపోలేదా.. కొత్త ఛార్జ్‌షీట్‌తో ఇంకా చాలా ఉందని సిబిఐ హింట్‌ ఇచ్చిందా..తాజాగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం నలుగురిపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఒక చార్జిషీట్‌ దాఖలు చేయగా, దానికి అనుబంధంగా మంగళవారం సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆడిటర్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును..

Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో అసలు కథ ముందుందా? సీబీఐ తాజా ఛార్జ్‌షీట్‌లో కీలక వ్యక్తుల పేర్లు..
CBI
Shiva Prajapati
|

Updated on: Apr 26, 2023 | 7:57 AM

Share

ఢిల్లీ లిక్కర్‌ కేసు కథ ఇంకా ముగిసిపోలేదా.. కొత్త ఛార్జ్‌షీట్‌తో ఇంకా చాలా ఉందని సిబిఐ హింట్‌ ఇచ్చిందా..తాజాగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం నలుగురిపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఒక చార్జిషీట్‌ దాఖలు చేయగా, దానికి అనుబంధంగా మంగళవారం సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆడిటర్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబును, మరో ఇద్దరిని నిందితుల జాబితాలో చేర్చింది.

ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ రాగానే కోర్టుకు సమర్పిస్తామంటున్న సీబీఐ..

ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను విచారణకు పిలిచిన సీబీఐ, ఆ తర్వాత అరెస్టు చేసింది. ఇప్పుడు ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన నుంచి అమలు చేయడం వరకు జరిగిన అక్రమాలు, అవకతవకల్లో సిసోడియానే ప్రధాన కుట్రదారుడని సీబీఐ ఆరోపిస్తోంది. ఇదే కేసులో మనీలాండరింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అభియోగాలు మోపినవారిలో ఆడిటర్ బుచ్చిబాబు ముందే బెయిల్ తీసుకోవడంతో ఆయన బయటే ఉన్నారు. అర్జున్ పాండేను అరెస్టు చేయాల్సి ఉందని స్పెషల్ కోర్టుకు సీబీఐ తెలియజేసింది. తాము సేకరించిన డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన వెంటనే వాటిని కోర్టుకు సమర్పిస్తామని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈ చార్జిషీటును పరిగణలోకి తీసుకునే విషయంపై మే 12న విచారణ చేపడతామని స్పెషల్ కోర్టు తెలిపింది.

సిసోడియా తప్ప మిగతా అందరూ బయటే..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటి వరకు మొత్తం 11 మందిపై చార్జిషీటు దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్‌లో నాటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరో 14 మందిని నిందితులుగా పేర్కొన్న సీబీఐ, గత ఏడాది నవంబర్ 25న దాఖలు చేసిన తొలి చార్జిషీటులో విజయ్ నాయర్‌తో పాటు మరో ఆరుగురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులోని 11 మందిలో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేయగా, వారిలో మనీశ్ సిసోడియా మినహా మిగతా అందరూ బెయిల్‌పై విడుదలయ్యారు. కొందరు అరెస్టు కాకముందే బెయిల్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సీబీఐ..

ఇదే కేసులో తాజాగా సీబీఐ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచి ప్రశ్నించింది. అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే ప్రశ్నించిన సీబీఐ, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. వీరిద్దరితో పాటు కేసుతో సంబంధం ఉన్న పలువురు సాక్షులు, అనుమానితులను ప్రశ్నించి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసుకుంది. అయితే అనుబంధ చార్జిషీటుతో కథ ముగిసిపోలేదని, ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వెల్లడించడంతో ఈ దర్యాప్తు ఎంతవరకు ముందుకెళ్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ తదుపరి దర్యాప్తు ముందుకు సాగితే అటు కేజ్రీవాల్, ఇటు కవితకు ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us