AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాల్ తగిలి చనిపోయిన భారత క్రికెటర్ ఎవరో తెలుసా? ఇప్పటి వరకు 174 మందిని బలిగొన్న క్రికెట్ బాల్

క్రికెట్‌ బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన భారత క్రికెటర్‌ రమణ్‌ లాంబా విషాద ఘటన ఇప్పటికీ గుర్తుండిపోయే సంఘటన. 1998లో ఢాకాలో ఫీల్డింగ్‌ చేస్తుండగా బంతి తలకు తగలడంతో తీవ్ర మెదడు గాయానికి గురై మూడు రోజుల తర్వాత మరణించారు. చారిత్రక అధ్యయనాల ప్రకారం 1858 నుంచి 2016 వరకు క్రికెట్‌కు సంబంధించిన 174 మరణాలు నమోదయ్యాయి.

బాల్ తగిలి చనిపోయిన భారత క్రికెటర్ ఎవరో తెలుసా? ఇప్పటి వరకు 174 మందిని బలిగొన్న క్రికెట్ బాల్
How Many Cricketers Died After Being Hit By Cricket Ball
SN Pasha
|

Updated on: Aug 18, 2026 | 8:00 AM

Share

క్రికెట్‌ను సాధారణంగా సురక్షితమైన క్రీడగానే భావిస్తాం. కానీ గంటకు 140 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకొచ్చే బంతి శరీరంలోని కీలక భాగాలకు తగిలితే ప్రాణాంతకంగా మారొచ్చు. చారిత్రక రికార్డులు, వైద్య అధ్యయనాల ప్రకారం శతాబ్దాలుగా క్రికెట్‌ ఆడుతూ బంతి తాకిడితో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక చారిత్రక అధ్యయనం ప్రకారం 1858 నుంచి 2016 మధ్య మొత్తం 174 క్రికెట్‌ సంబంధిత మరణాలు నమోదయ్యాయి.

ఫిలిప్ హ్యూస్‌.. ప్రపంచాన్ని కుదిపేసిన విషాదం

క్రికెట్‌ బంతి తాకిడితో జరిగిన అత్యంత విషాదకర ఘటనల్లో ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిలిప్ హ్యూస్‌ మరణం ఒకటి. 2014లో దేశవాళీ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ అతని మెడ భాగంలో బలంగా తగిలింది. వెన్నుపూస సమీపంలోని రక్తనాళానికి తీవ్రమైన గాయం కావడంతో హ్యూస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని రోజుల తర్వాత మరణించాడు. ఈ ఘటన తర్వాత బ్యాటర్ల భద్రతపై క్రికెట్‌ ప్రపంచంలో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా హెల్మెట్ల డిజైన్‌, మెడ రక్షణకు సంబంధించిన పరికరాలపై మరింత దృష్టి పెట్టారు.

రమణ్ లాంబా.. ఫీల్డింగ్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు

ఫిబ్రవరి 23, 1998న భార‌త క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 38 ఏళ్ల వ‌య‌స్సులో టీమిండియా కీల‌క ఆట‌గాడు రామ‌న్ లాంబా ప్రాణాలు విడిచారు. 1998లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన క్లబ్ మ్యాచ్ యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటిలో చాలా మంది భారత క్రికెటర్లు బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెట్‌లో ఆడేవారు. ఈ క్రమంలో ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్‌లో అబహానీ క్రిరా చక్రకు ప్రాతినిధ్యం వహించిన లాంబా.. మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో అకాల మరణం చెందారు. రామన్ లాంబా సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ప్రత్యర్ధి జట్టు బ్యాటర్ మెహ్రబ్ హుస్సేన్ భారీ షాట్ కొట్టాడు.

ఈ క్రమంలో బంతి బలంగా సిల్లీ పాయింట్‌లో ఉన్న లాంబాకు తాకి వికెట్ కీపర్ వైపు వెళ్లింది. అయితే బంతి తాకిన వెంటనే గాయం అంత తీవ్రమైనదిగా అన్పించలేదు. అతడు ఫీల్డ్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ అంతరంగా గాయం కావడంతో అతడు కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. వెంటనే అతడిని ఫీల్డ్ నుం‍చి బయటకు తీసుకువెళ్లి దగ్గరలో ఉన్న అస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పలు పరీక్షలు తర్వాత బంతి తలకు బలంగా తాకడంతో మెదడులో తీవ్రమైన రక్తస్రావం జరిగిందని డాక్టర్లు నిర్ధారించారు. అస్పత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత లాంబా తుది శ్వాస విడిచారు. లాంబా భారత తరుపున 4 టెస్టులు, 32 వన్డేలు ఆడారు. మొత్తంగా ఆయన పేరిట 885 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి.

గుండెపై బంతి తగిలినా ప్రమాదమే

క్రికెట్‌ బంతి తలకు మాత్రమే కాకుండా ఛాతీపై బలంగా తగిలినా ప్రాణాపాయం ఏర్పడవచ్చు. దీనికి వైద్యపరంగా కమోషియో కార్డిస్‌ అని పేరు. గుండెకు నేరుగా బలమైన దెబ్బ తగలడం వల్ల గుండె విద్యుత్‌ రిథమ్‌ ఒక్కసారిగా దెబ్బతిని కార్డియాక్‌ అరెస్ట్‌ సంభవించవచ్చు. 1959లో పాకిస్థాన్‌కు చెందిన వికెట్‌కీపర్‌-బ్యాటర్‌ అబ్దుల్ అజీజ్‌ మ్యాచ్‌లో ఛాతీపై బంతి తగిలిన తర్వాత కుప్పకూలి మరణించిన ఘటన దీనికి ఉదాహరణగా నమోదైంది.

1870లోనే మరో విషాదం

క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి ప్రమాదాలు కొత్తవి కావు. 1870లో ఇంగ్లాండ్‌కు చెందిన కౌంటీ క్రికెటర్‌ జార్జ్‌ సమ్మర్స్‌కు వేగంగా వచ్చిన బంతి తలకు తగిలింది. తీవ్ర గాయాల కారణంగా ఆయన మరణించారు. అప్పట్లో ఆధునిక హెల్మెట్లు, రక్షణ పరికరాలు అందుబాటులో లేకపోవడం ప్రమాదాన్ని మరింత పెంచింది.

ఇప్పుడు భద్రతా ప్రమాణాలు మరింత మెరుగ్గా

తల, మెడ, ఛాతీ వంటి కీలక భాగాలకు బంతి తగలడం వల్ల ఫ్రాక్చర్లు, మెదడు గాయాలు, రక్తనాళాల దెబ్బతినడం, గుండె రిథమ్‌ సమస్యలు వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. అయితే ఆధునిక క్రికెట్‌లో నాణ్యమైన హెల్మెట్లు, నెక్‌ ప్రొటెక్టర్లు, ఛాతీ రక్షణ పరికరాలు, మెరుగైన వైద్య సదుపాయాల కారణంగా ఇలాంటి మరణాలు చాలా అరుదుగా మారాయి. అయినప్పటికీ క్రికెట్‌ బంతిని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ప్రొఫెషనల్‌ ఆటగాళ్లకే కాకుండా చిన్నారులు, ఔత్సాహిక క్రికెటర్లు కూడా సరైన రక్షణ పరికరాలు ధరించడం అత్యంత అవసరం.

Follow Us