ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. 3ఏళ్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ..!
South Africa vs Australia: ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 24 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు దక్షిణాఫ్రికా 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. టెంబా బవుమా కెప్టెన్‌గా తిరిగి రానుండగా, గెరాల్డ్ కోయెట్జీ మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్లర్‌లకు కూడా చోటు దక్కింది.

South Africa vs Australia: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు దక్షిణాఫ్రికా 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. టెంబా బవుమా ఫిట్‌నెస్ సమస్యలను అధిగమించి జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. వన్డే ప్రపంచ కప్ (2027 ODI World Cup)నకు సన్నాహకంగా ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా చూస్తోంది.
రబడాకు భారీ షాక్..
స్టార్ పేసర్ కగిసో రబడ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. హ్యామ్‌స్ట్రింగ్‌కు గ్రేడ్-3 గాయం కావడంతో అతడు దాదాపు 9–10 వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. మరోవైపు ఐడెన్ మార్క్రమ్ తొలి వన్డేకు దూరంగా ఉంటాడు. రెండో, మూడో మ్యాచ్‌లకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌కు అతడు ఎందుకు దూరమవుతున్నదన్న కారణాన్ని ప్రోటీస్ గోప్యంగా ఉంచింది.
మూడేళ్ల తర్వాత కోయెట్జీ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ గెరాల్డ్ కోయెట్జీకి వన్డే జట్టులో తిరిగి చోటు లభించింది. చివరిసారిగా 2023 మార్చిలో వెస్టిండీస్‌పై ODI ఆడిన అతడు.. ఇప్పుడు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ వన్డే సెటప్‌లోకి వచ్చాడు.
క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్లర్‌లను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేకపోయినా ఇద్దరినీ జట్టులోకి తీసుకోవడం 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో వారి పేర్లు ఉన్నాయనే సంకేతంగా నిలిచింది. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న డి కాక్.. 2025 డిసెంబరులో భారత్‌పై తన చివరి వన్డేలో సెంచరీ చేశాడు. మిల్లర్‌కు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత దక్షిణాఫ్రికా వన్డే జట్టులో ఇదే తొలి అవకాశం.
2023లో ఆస్ట్రేలియాపై అదరగొట్టిన ప్రోటీస్..
దక్షిణాఫ్రికా జట్టులో టెంబా బవుమా, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బోష్, మాథ్యూ బ్రీట్జ్కీ, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జీ, బ్జోర్న్ ఫోర్టుయిన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నారు.
నమీబియాతో ఆడే జట్టులో ఉన్న టోనీ డి జోర్జీ మాత్రమే ఆ సిరీస్ నుంచి ఆస్ట్రేలియా వన్డేలకు కూడా ఎంపికయ్యాడు. 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన చివరి ODI సిరీస్‌లో ఇరు జట్లు ఐదు మ్యాచ్‌లు ఆడాయి. తొలి రెండు మ్యాచ్‌లు కోల్పోయిన ప్రోటీస్.. చివరి మూడు గెలిచి 3–2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
