చింతన్‌ శిబిర్‌ సంక్షోభాల నుంచి కాంగ్రెస్‌ను బయటపడేయగలదా? పూర్వ వైభవం తేగలదా?

మూడున్నర దశాబ్దాల కిందటి ముచ్చట. దూరదర్శన్‌లో నఖాబ్‌ అనే సీరియల్‌ వచ్చింది. ఓ వృద్ధ సూపర్‌స్టార్‌ హీరోపై కొందరు పోకిరిలు దాడి చేస్తారు.

చింతన్‌ శిబిర్‌ సంక్షోభాల నుంచి కాంగ్రెస్‌ను బయటపడేయగలదా? పూర్వ వైభవం తేగలదా?
Congress
Follow us
Balu

| Edited By: Ravi Kiran

Updated on: May 13, 2022 | 1:52 PM

మూడున్నర దశాబ్దాల కిందటి ముచ్చట. దూరదర్శన్‌లో నఖాబ్‌ అనే సీరియల్‌ వచ్చింది. ఓ వృద్ధ సూపర్‌స్టార్‌ హీరోపై కొందరు పోకిరిలు దాడి చేస్తారు. ఆ దెబ్బలకు ఆ నటుడికి పక్షపాతం వచ్చేస్తుంది. అప్పటి వరకు సూపర్‌స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన అతడి పరిస్థితి కొడిగట్టిన దీపంలా మారుతుంది. సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ కరిగిపోతుంది. పైపై మెరుగులు తరిగిపోతాయి. తన రూపం తనకే అసహ్యంగా కనిపించడం మొదలవుతుంది. ఒక్కసారిగా వృద్ధాప్యం మీదపడిందన్న భావన అతడిని మరింత కుంగదీస్తుంది. ఆ సమయంలో సూపర్‌స్టార్‌ హోదా ఓ యువ హీరో ధారదత్తమవుతోంది. వృద్ధ నటుడికి ఏం చేయాలో పాలుపోదు. ఆత్మహత్యే శరణ్యమనుకుంటాడు. అతడికి సపర్యలు చేయడానికి నియమితురాలైన ఓ నర్సు అతడి శరీరానికి వచ్చిన వైకల్యాన్ని నయం చేయడమే కాదు, అతడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇంకా కథ ఉంది కానీ, అది మనకు అప్రస్తుతం.

సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. కాకపోతే కాయకల్ప చితకిత్స చేసేవారే లేకుండా పోయారు. చేస్తానని వచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌ చల్లాగా జారుకున్నారు. రాజకీయంగా బలహీనపడిపోయింది. వరుస ఎన్నికల పరాజయాలతో నిరాసక్తత ఆవరించింది. అంతర్గత సవాళ్లు పార్టీని సంక్షోభంలో నెట్టివేశాయి. అధినాయకత్వం ధోరణులపై ధిక్కార స్వరం వినిపించసాగింది. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీ మునుపెన్నడూ లేనంతగా విషమ పరిస్థితిలోకి వెళ్లిపోయింది. దీన్ని అధిగమించడానికి, ఆత్మ విమర్శ చేసుకోవడానికి చింతన్‌ శిబిర్‌ పేరిట ఓ సమావేశాన్ని నిర్వహించుకుంటోందా పార్టీ! మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పార్టీకి పూర్వ వైభవం తేవడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నిక నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం! వీటిని లక్ష్యంగా పెట్టుకుని తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చింతన్‌ శిబిర్‌ను నిర్వహించుకుంటోంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే అయినా గత ఆరేడేళ్లుగా కాంగ్రెస్‌ ఖాతాలో ఓటములే పడుతున్నాయి. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కాంగ్రెస్‌ పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆశించిన మేర విజయాలు సాధించలేకపోతోంది. ఇలాంటి సమయంలో జరుగుతోన్న చింతన్‌ శిబిర్‌ కాంగ్రెస్‌కు చాలా కీలకం. 2013లో జైపూర్‌లో చివరి సారిగా చింతన్‌శిబిర్‌ను ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్‌. ఈ సమావేశాలలో చాలా విషయాలపై చర్చించబోతున్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల దగ్గర్నుంచి జమ్ము కశ్మీర్‌ పరిస్థితులు, ఆర్ధిక సంక్షోభం, వివిధ పార్టీలతో పొత్తులు వంటి అంశాలను కూడా నేతలు చర్చిస్తారు. అంతేకాదు రాహుల్‌గాంధీని పార్టీకి అధ్యక్షుడిని చేస్తారా లేదా అన్నది కూడా తేలిపోతుంది. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌ వంటి వారు రాహుల్‌కే పార్టీ పగ్గాలు ఇవ్వాలని అంటున్నారు. రణదీప్‌ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ వంటి సీరియన్‌ నేతల అభిప్రాయం కూడా ఇదే! ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరపాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

తమిళనాడు, బెంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఒడిషా, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా క్రమంగా విస్తరిస్తోంది. అయితే వీటిలో తమ అభిప్రాయాలను గౌరవించే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ అనుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర సమితి, ఆమ్‌ ఆద్మీ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని ఇప్పటికే కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. కర్నాకటలో కూడా ఒంటరిగానే బరిలో దిగాలని భావిస్తోంది. ఇప్పుడు దేశంలో మూడో ఫ్రంట్‌కు అంతగా అవకాశాలు లేవు. ప్రాంతీయ పార్టీలు కలిసి మూడో కూటమిని పెట్టుకున్నా కాంగ్రెస్‌ సపోర్ట్ కావాల్సిందే. బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటోంది. బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు తమతో చేతులు కలపవచ్చని హస్తం పార్టీ సంకేతాలు పంపింది.