EC Letter: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఎప్పుడంటే.. రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ!

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రధాన రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

EC Letter: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఎప్పుడంటే.. రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ!
Chief Election Commission

Updated on: Aug 12, 2021 | 4:42 PM

EC Letter to Political Parties on By Election: హుజూరాబాద్ ఎన్నికలకు టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ ఓ రివ్యూ పెట్టుకుని కసరత్తు చేస్తోంది. ఇటు బీజేపీ నుంచి ఈటల పేరు కూడా త్వరలో బయటకువచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ రేపో మాపో వస్తుందీ అనుకున్న ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ అసలు వస్తుందా రాదా అన్నదే సస్పెన్స్‌గా మారింది. సస్పెన్స్ మాత్రమే కాదు.. ఆగస్టు 30లోపు షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా లేదన్న సంకేతాలు సీఈసీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రధాన రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. వివిధ కారణాల దృష్ట్యా అయా రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన ఉప ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను కోరుతూ అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అయా పార్టీల అభిప్రాయాలను వెల్లడించాల్సిందిగా కోరింది. ఇందుకోసం ఆగస్టు 30వ తేదీ వరకు డెడ్‌లైన్ విధించింది.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖం డ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే అక్కడి ప్రధాన ఎన్నికల అధికారులతో కేంద్ర ఎలక్షన్ కమిషనర్లు సమావేశమై సమీక్ష నిర్వహించారు. వివిధ స్థాయి అధికారులతో ప్రభుత్వ సన్నద్ధతపై ఆరా తీశారు. ఇప్పుడు పార్టీల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మరోవైపు, రేపో మాపో షెడ్యూల్ వస్తుందని, హుజూరాబాద్ మాత్రమే కాదు, ఏపీలో బద్వేల్ నియోజకవర్గం కూడా ఎదురుచూస్తోంది. అటు దేశంలో ఈ ఏడాది జరగాల్సిన 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా ఆయా రాష్ట్రాల్లో పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. కానీ, కొవిడ్‌ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించవచ్చా.. లేదా, నిర్వహిస్తే ఎలాంటి గైడ్‌లైన్స్ ఉంటే బెటర్‌ అని కొన్ని ప్రశ్నలు వేస్తూ, దేశంలోని పార్టీలను సూచనలు సలహాలు అడిగింది ఈసీ. అందుకు డెడ్‌లైన్‌ను ఆగస్టు 30 వరకూ పెట్టింది. అంటే.. ఈలోపు షెడ్యూల్ వచ్చే అవకాశమే లేదన్న సిగ్నల్స్‌ ఈ లేఖలో కనిపిస్తున్నాయి.

ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అనువైన వాతావరణం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అక్టోబరు వరకు సాధారణ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో హుజూరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణ కూడా ప్రశ్నార్థకంగా మారింది.

గతంలో తమిళనాడు, బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత కొవిడ్ సెకండ్ వేవ్‌ విపరీతంగా ప్రబలింది. మరణాల సంఖ్య పెరగడానికి కారణమూ ఎన్నికలే అన్న వాదన కూడా వినిపిచింది. పరోక్షంగా ఎలక్షన్ కమిషన్ కూడా మాట పడాల్సి వచ్చింది. ఈ తరుణంలో ముందస్తు జాగ్రత్తగా ఈసీ పార్టీలకు లేఖ రాయడం బట్టి చూస్తుంటే హుజారాబాదే కాదు, దేశంలో ఏ ఎన్నికలకైనా ఆగస్టు 30లోపు షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపించేలా లేదు.

Read Also… Amit Shah: శ్రీశైలంలో కేంద్ర మంత్రి అమిత్ షా‌ పర్యటన.. రాయలసీమ బీజేపీ నేతల ‘ప్రత్యేక’ వినతి