Well: మాయదారి నీళ్ల బావి.. ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురిని వరుసగా మింగేసింది!

|

Jul 05, 2024 | 7:30 PM

బావిలో విషవాయువు పీల్చి ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఓ తండ్రి, అతని ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని చంపా జిల్లా కికిర్దా గ్రామంలో శుక్రవారం (జులై 5) ఉదయం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బిలాస్‌పూర్ రేంజ్) సంజీవ్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం..

Well: మాయదారి నీళ్ల బావి.. ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురిని వరుసగా మింగేసింది!
Toxic Gas Inside Well
Follow us on

ఛత్తీస్‌గఢ్‌, జులై 5: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. బావిలో విషవాయువు పీల్చి ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఓ తండ్రి, అతని ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని చంపా జిల్లా కికిర్దా గ్రామంలో శుక్రవారం (జులై 5) ఉదయం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బిలాస్‌పూర్ రేంజ్) సంజీవ్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం..

చంపా జిల్లా బిర్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైశ్వాల్‌ (60) అనే వ్యక్తి తన ఇంటి పెరట్లోని బావిలో పడిపోయిన చెక్క ముక్క కోసం దాదాపు 30 అడుగుల లోతైన బావిలోకి దిగాడు. అయితే అతను ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అతడి భార్య గొళ్లుగొళ్లున ఏడుస్తూ ఇరుగు పొరుగు సాయం కోరింది. దీంతో జైశ్వాల్‌ను రక్షించేందుకు రమేశ్‌ పటేల్‌ (50), అతని ఇద్దరు కుమారులు రాజేంద్ర పటేల్‌ (20), జితేంద్ర పటేల్‌ (25) ముగ్గురూ ఒకరితర్వాత ఒకరు బావిలోకి దిగారు. అయితే ఈ ముగ్గురూ కూడా తిరిగి పైకి రాలేదు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత చంద్ర (25) అనే మరో వ్యక్తి కూడా అందులోకి దిగాడు. అతడు కూడా బయటకు రాలేదు. దీంతో భయాందోళనలకు గురైన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బావిలోని విషవాయువు పీల్చి వారంతా చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం బావిలోంచి ఐదుగురి మృతదేహాలను స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీమ్‌ వెలికి తీయగా.. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం వీరి మరణానికి అసలు కారణం తెలుస్తుందని న్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సంజీవ్‌ శుక్లా తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తునట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ సాయి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.