జమిలి ఎన్నికలు గత కొన్నేళ్లుగా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ఇది ఎప్పుడు కొలిక్కి వస్తుందోనని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల గురించి స్పష్టత ఇచ్చింది. ఈ జమిలి ఎన్నికలను నిర్వహించడం కష్టమైన పని అని పార్లమెంట్‌లో తేల్చి చెప్పేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపడం అనేది సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలియజేశారు. జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అయితే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని మేఘ్వాల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల వల్ల కొన్ని లాభాలున్నప్పటికీ అనేక అవరోధాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికలు నిర్వహించాలంటో ముఖ్యంగా 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తుంది. ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ఇందుకు అంగీకరించాలి. దీంతోపాటు పెద్దఎత్తున ఈవీఎంలు, వీవీప్యాట్‌ల అవసరం ఉంటుంది. అలాగే దేశంలోని అన్నిచోట్ల భద్రత మోహరింపు సాధ్యమయ్యే పని కాదు. జమిలి ఎన్నికల నిర్వహణపై న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలించిందని.. తదుపరి విధాన రూపకల్పన జాతీయ లా కమిషన్ పరిశీలో ఉందని మంత్రి మేఘ్వాల్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..