Covid-19 Restrictions: కరోనా నిబంధనలు ఎత్తివేయడం సరైనదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Mar 26, 2022 | 9:12 PM

Coronavirus Restrictions in India: ప్రపంచవ్యాప్తంగా రెండళ్ల నుంచి కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. దీని ప్రభావంతో ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది.

Covid-19 Restrictions: కరోనా నిబంధనలు ఎత్తివేయడం సరైనదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Coronavirus
Follow us on

Coronavirus Restrictions in India: ప్రపంచవ్యాప్తంగా రెండళ్ల నుంచి కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. దీని ప్రభావంతో ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అయితే.. ఇప్పుడిప్పుడే కరోనా పీడ నుంచి విముక్తి పొందుతున్నామనుకున్న తరుణంలో పలు దేశాల్లో వెలుగులోకి వస్తున్న వేరియంట్స్.. భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 182.3 కోట్లకుపైగా వ్యాక్సిన్లను పంపిణీ చేసింది. అయితే.. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి అనంతరం కేంద్రం కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిన రెండేళ్ల తర్వాత మార్చి 31 నుంచి అన్ని కోవిడ్ -19 నిబంధనలను, ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం లాంటి నిబంధనలు కొనసాగుతాయని ప్రకటించింది. దేశంలో కోవిడ్-19 నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 24, 2020న మొదటిసారిగా విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద కఠిన ఆదేశాలతోపాటు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలను పలు సందర్భాల్లో కేంద్రం సవరిస్తూ వచ్చింది.

ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. అజయ్ భల్లా మాట్లాడుతూ.. గత 24 నెలలుగా మహమ్మారి నియంత్రణకు సంబంధించిన పరీక్షలు, నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్స, టీకాలు వేయడం వంటి అంశాలను అనుసరించినట్లు తెలిపారు. దీంతోపాటు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కూడా పెంచామన్నారు. అలాగే, కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా అనుసరించాల్సిన విధానాలపై ఇప్పుడు ప్రజలకు ఎక్కువ అవగాహన ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. కరోనా నిబంధనలు మరో 5 రోజుల్లో ఎత్తివేస్తున్న దృష్ట్యా నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

మరింత అవగాహన అవసరం..

దీనిపై SRL డయాగ్నోస్టిక్స్ సాంకేతిక సలహాదారు డాక్టర్ అభా సభిఖి ఈ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడారు. ఈ మేరకు ఆమె News9తో మాట్లాడుతూ.. అన్నింటిని దృష్టిలోకి తీసుకోని ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. మన జనాభా, టీకా, ఇన్ఫెక్షన్ స్థితిని పరిగణలోకి తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా యువత ఎక్కువగా ఉన్నారని.. టీకాలు తీసుకోని పిల్లలలో 80 శాతం వరకు కరోనా యాంటీబాడిస్ అభివృద్ధి అయినట్లు నిపుణులు పేర్కొంటున్నారన్నారు. ప్రజలకు మరింత అవగాహన అవసరం అని అభిప్రాయపడ్డారు. అయితే థర్డ్ వేవ్.. యూరప్ మొదలైన తర్వాత చాలా ఆలస్యంగా మన దగ్గర మొదలవ్వడం చూశామన్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని COVID-19 నిబంధనలను తొలగించారని.. ఇది సరైన మార్గం అంటూ సభిఖి పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ.. అన్ని ఆంక్షలను ఉపసంహరించడం వలన వైరస్ వ్యాప్తి అవకాశాలు పెరుగుతాయని, ఇది ఆరోగ్య మౌలిక సదుపాయాలపై భారం పడవచ్చని కొందరు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డబ్ల్యూహెచ్ఓ ఆదేశాలను అనుసరించాలి..

ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ డైరెక్టర్ & యూనిట్ హెడ్ పల్మోనాలజీ డాక్టర్ రవి శేఖర్ ఝా News9 తో మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు చేస్తుందంటూ గుర్తుచేశారు. ఇప్పుడే కేసుల పెరుగుదలను అంచనా వేయడం కష్టం కావున దేశంలో కోవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయకపోవడం మంచిదన్నారు. పదే పదే WHO నుంచి హెచ్చరికలు అందుతున్నాయని… ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా మార్గదర్శకాలు ఉంటేనే మంచిదని రవి శేఖర్ అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ యాంటీబాడీలను మాత్రమే అభివృద్ధి చేస్తుందని.. ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించదంటూ పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్ తేలికపాటి ఇన్‌ఫెక్షన్‌ను తీవ్రంగా మారకుండా చేస్తుందన్నారు. జాగ్రత్తలతోనే కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందంటూ పేర్కొన్నారు. ఇది మనమందరం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం అని సూచించారు. దశల వారీగా ఆంక్షలను ఎత్తివేయడం మంచిదే కానీ.. నిబంధనలు పూర్తిగా ఎత్తివేసే ముందు కనీసం ఆరు నెలల పాటు ‘వెయిట్ అండ్ వాచ్’ విధానాన్ని అవలంబించాలని ఆయన సూచించారు.

ఆ అధికారం రాష్ట్రాలకే..

విపత్తు నిర్వహణ చట్టాన్ని తొలగించనున్నట్లు పేర్కొన్న తర్వాత హోంశాఖ సెక్రటరీ పలు సూచనలు చేశారు. వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలఅన్నారు. కేసుల సంఖ్యలో ఏదైనా పెరుగుదల కనిపిస్తే.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. సొంతంగా ఆంక్షలు విధంచే అవకాశాన్ని రాష్ట్రాలకే ఇచ్చినట్లు పేర్కొన్నారు.

కోవిడ్ నియంత్రణ చర్యల కోసం విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఇచ్చిన ఆదేశాలు, మార్గదర్శకాలను మార్చి 31 నుంచి నిలిపివేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అజయ్ భల్లా సూచించారు. నియంత్రణ చర్యలు, టీకాలు వేయడం, ఇతర సంబంధిత అంశాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసిన ఆదేశాలను కొనసాగించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Also Read:

Akhilesh Yadav: యూపీ ప్రతిపక్ష నేత‌గా అఖిలేష్ యాద‌వ్‌.. ఎస్పీ సమావేశంలో కీలక నిర్ణయం..

Yogi Adityanath: రెండో సారి రాష్ట్ర పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ తొలి కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే..!