New CEC: మరో 4 రోజుల్లో ఈసీఈ రాజీవ్‌ కుమార్‌ గుడ్‌బై..! కొత్త చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఎవరో?

ప్రస్తుతం 25వ చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న రాజీవ్‌ కుమార్‌ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ఎన్నికల కమిషనర్‌ ఎవరు? అనే దానిపై ముమ్మర చర్చ సాగుతోంది. నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నియమించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ వచ్చే వారం ప్రారంభంలో సమావేశం కానుంది..

New CEC: మరో 4 రోజుల్లో ఈసీఈ రాజీవ్‌ కుమార్‌ గుడ్‌బై..! కొత్త చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఎవరో?
CEC Rajiv Kumar

Updated on: Feb 14, 2025 | 6:15 PM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను నియమించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ వచ్చే వారం ప్రారంభంలో సమావేశం కానుంది. ఈ ప్యానెల్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర క్యాబినెట్ మంత్రి కూడా ఉన్నారు. ప్రస్తుతం 25వ చీఫ్‌ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న రాజీవ్‌ కుమార్‌ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం లేదా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సమావేశమై కొత్త సీఈసీని ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో కమిటీ ఒకరి పేరును సిఫార్సు చేయనుంది. ఆ సిఫార్సు ఆధారంగా కమిటీ అధ్యక్షుడు తదుపరి CECని నియమిస్తారు.

కొత్త ఎన్నికల కమిషనర్‌ ఎవరు?

ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్ కుమార్ తర్వాత.. జ్ఞానేష్ కుమార్ అత్యంత సీనియర్ ఎన్నికల కమిషనర్. ఆయన పదవీకాలం జనవరి 26, 2029 వరకు ఉంది. అదే సీనియార్టీతో సుఖ్‌బీర్ సింగ్ సంధు అనే మరొక ఎన్నికల కమిషనర్ కూడా ఉన్నారు. గతంలో సీనియర్టీని బట్టి సీనియర్ ఎన్నికల కమిషనర్‌ను సీఈసీగా నియమించే ఆచారం ఉండేది. కానీ 2023లో CEC, ECల నియామకాలకు సంబంధించి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ప్రధాని నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సెలెక్షన్‌ కమిటీ ఐదుగురు కార్యదర్శి స్థాయి అధికారుల పేర్లను ప్యానెల్ పరిశీలన కోసం షార్ట్‌లిస్ట్ చేస్తుంది. ఈ కమిటీలో ప్రధానితోపాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ కొత్త సీఈసీ పేరును ఖరారు చేస్తారన్నమాట. సీఈసీ హోదాలో రాజీవ్‌ కుమార్‌ చివరగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రపతి ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలు కూడా రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోనే జరిగాయి.

కొత్త ఎన్నికల సంఘాన్ని నియమించడానికి కూడా అదే పద్ధతిని అనుసరిస్తారు. CEC, ఇతర ECలు భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయికి సమానమైన పదవిని కలిగి ఉన్న వ్యక్తులను నియమిస్తారు. ఇక కొత్త చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నేతృత్వంలో ఈ ఏడాది చివరన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్‌, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కాగా రాజీవ్‌ కుమార్‌ 2022 మే నెలలో సీఈసీగా ఎంపికైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.