తమిళ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన హీరో విజయ్ దళపతి. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో.. ఇప్పుడు ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam)’ పేరుతో ఈ ఏడాది కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే కొన్నిరోజులుగా నేరుగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, సామాజిక సేవలలో పాల్గొంటున్నారు. మరోవైపు ఇప్పటికే అంగీకరించిన చిత్రాలను కంప్లీట్ చేసి ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల్లో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం జెండాను, సింబల్‌ని ఆవిష్కరించారు. పనైయూర్‌లోని పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేసి.. తన పార్టీకి సంబంధించిన అధికారిక పాటను కూడా విడుదల చేశారు విజయ్. పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం.. తమిళుల విజయ కూటమి. జెండా నిండా మెరూన్ కలర్ అండ్ పసుపు పచ్చ.. పోరాడే తత్వానికి సింబల్‌గా రెండు ఏనుగులు, మధ్య వాగై పుష్పం. ఈ పువ్వును విజయానికి గుర్తుగా భావిస్తారు ద్రవిడులు. ఇదీ క్లుప్తంగా విజయ్ పార్టీ పతాక. జెండా వేడుక అదుర్స్ అనేలా ఉన్నా.. ఆరంభంలోనే వివాదాలు చుట్టుముట్టాయి. జెండాపై ఏనుగుల బొమ్మల్ని తొలగించాలంటోంది బీఎస్పీ.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అస్సాం, సిక్కిం రాష్ట్రాల్లో మినహా మిగతా ఏ రాష్ట్రంలోనూ తమ పార్టీ జెండాలోని ఏనుగు సింబల్‌ని వాడకూడదంటున్నారు తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆనంద్. లేటెస్ట్‌గా ప్రకటించిన విజయ్ పార్టీ జెండాలో రెండు ఏనుగుల గుర్తుల్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారాయన. “విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాలో రెండు ఏనుగు బొమ్మలు ఉన్నాయి. తమ పార్టీ సింబల్‌లో ఉన్న ఏనుగు గుర్తును విజయ్ వాడుకోవడం సరికాదు. వెంటనే ఆ ఏనుగు గుర్తుల్ని తొలగించాలి. ఈ విషయాన్ని మా పార్టీ చీఫ్ మాయవతి దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఇప్పటికైనా విజయ్ జెండాలోని ఏనుగు గుర్తుల్ని తీసివేయాలని ఆ పార్టీ నేతల్ని కోరాం. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం. రెండు పార్టీల మధ్య విభేదాలు రాకుండా ఉంటే మంచిది” బీఎస్పీ అధ్యక్షుడు ఆనంద్ అన్నారు.
ఏనుగుల సింబల్స్‌పై బీఎస్పీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. జెండాపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మెరూన్ అండ్ ఎల్లో కలర్ జెండా అచ్చం స్పెయిన్ జాతీయ జెండాను పోలి ఉందని ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రజాజీవితంలోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్.. తమిళనాట సీరియస్ పొలిటీషియన్‌గా మారబోతున్నారు. అయితే ఆరంభంలోనే వివాదం అభిమానుల్ని కాస్త డిసప్పాయింట్ చేసింది. బీఎస్పీ అభ్యంతరాలతో విజయ్ తన పార్టీ జెండాలో మార్పులు చేర్పులు చేస్తారా లేదా చూడాలి.