ఆపరేషన్ సిందూర్‌లో బీఎస్ఎఫ్ పాత్ర ఎంత..? పూర్తి వివరాలు మీ కోసం..
ఆపరేషన్ సింధూర్లో బీఎస్‌ఎఫ్ కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు బీఎస్‌ఎఫ్ దీటైన ప్రతిస్పందన ఇచ్చింది. 70 పాక్ బోర్డర్ పోస్టులు, 42 ఫార్వర్డ్ స్థానాలను ధ్వంసం చేసింది. లష్కరేతోయిబా లాంచ్ ప్యాడ్‌లను నాశనం చేసి ఉగ్రవాదులను అంతమొందించింది. మహిళా జవాన్లు కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. బీఎస్‌ఎఫ్ సరిహద్దు భద్రతను బలోపేతం చేసింది.

బీఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) ఆపరేషన్ సింధూర్‌లో కీలకపాత్ర పోషించింది. సైన్యంతో పాటు బీఎస్‌ఎఫ్ వీరోచిత పోరాటంతో పాక్ రేంజర్లు కాలికి బుద్ధిచెప్పారు. మొత్తం 70 పాకిస్తాన్ బోర్డర్ ఔట్ పోస్టులతో పాటు, 42 ఫార్వర్డ్ లొకేషన్లను బీఎస్‌ఎఫ్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో పాక్ రేంజర్లు గాయపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. సుందర్బని సెక్టార్ ఎదురుగా ఉన్న ISI లాంచ్‌ప్యాడ్‌ని నామరూపాల్లేకుండా చేసింది. బీఎస్‌ఎఫ్ పోరాటంలో మహిళా జవాన్లు కూడా భాగస్వాములయ్యారు.
మే 9, 10 తేదీల్లో పాకిస్తాన్ జమ్మూ సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటంతో బీఎస్‌ఎఫ్ దీటైన జవాబిచ్చింది. పాక్‌లో లష్కరేతోయిబాకు చెందిన లూని లాంచ్‌ప్యాడ్‌ని ధ్వంసం చేసి 20 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించింది. ఆర్‌ఎస్ పురా సెక్టార్‌కి ఎదురుగా ఉన్న మరో లాంచ్‌ప్యాడ్ మాస్‌పూర్‌ని కూడా బీఎస్‌ఎఫ్ ధ్వంసంచేసింది. మే 10న BSF పోస్టుపై పాకిస్తాన్ డ్రోన్ దాడిని మన బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయి.
బీఎస్‌ఎఫ్ రియాక్షన్‌తో పాక్ కమ్యూనికేషన్, పోస్టులు, సర్వైలెన్స్ వ్యవస్థలకు భారీ నష్టం కలిగింది. భారీగా నష్టపోయిన పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని సరిహద్దు భద్రతా దళానికి సమాచారం ఉంది. అందుకే బార్డర్‌లో BSF పూర్తి అలెర్ట్‌గా ఉంది. సాంబా సెక్టార్‌లోని ఒక పోస్టుకు సింధూర్ అనే పేరు పెట్టాలనే ప్రతిపాదనను కేంద్రానికి పంపబోతోంది బీఎస్‌ఎఫ్. సరిహద్దుకు అవతల పాక్ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు పసిగట్టేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బీఎస్‌ఎఫ్ ఉపయోగిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
