యోగా దినోత్సవం సందర్భంగా నిన్న జోధ్ పూర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు కొందరు ఒంటెలపై యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒంటెల కాళ్ళను కట్టేసి వాటిని నేలపై బలవంతంగా పడుకోబెట్టి వాటిపై యోగా చేస్తున్న వారి నిర్వాకంపై అనేకమంది నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది క్రూరత్వం కాక మరేమిటన్నారు. జైపూర్ లో జనసత్తా అనే పత్రిక మాజీ ఎడిటర్ ఒకరు వీటిని షేర్ చేస్తూ కార్పెట్స్ మాదిరి ఒంటెల వీపు భాగాలపై యోగా చేస్తారా..ఇది దారుణం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, అధికారులు దీనిపై స్పందించి వీరిపైనా…ఇలా చేయాలనీ ఆదేశించిన అధికారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది ఇది చూసి.. యోగా దినోత్సవ ప్రాముఖ్యతను ఇలా హేళనగా తగ్గిస్తున్నారని వాపోయారు. భారత రక్షణకు నియుక్తులైన బీఎస్ఎఫ్ జవాన్లు ఇంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారనుకోలేదని కొంతమంది వ్యాఖ్యానించారు.
యోగా ఓ గిమ్మిక్కుగా..తమాషాగా మారిపోయిందని, ప్రపంచ దేశాలు మన ఇండియాయే దీన్ని ప్రాచుర్యం లోకి తెచ్చిందని చెప్పుకొంటుంటే.. మనం మాత్రం ఇంత దిగజారి పోయామని దుయ్యబట్టారు. ఇలా కెమెరాలకు పోజులిచ్చిన వీరిని ఏమనాలని ప్రశ్నించారు. కాగా ఈ వైనంపై ప్రభుత్వం గానీ, అధికారులు గానీ స్పందించలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిటిషన్ పై విచారణ నుంచి వైదొలగిన మరో ‘సుప్రీం’ జడ్జి …శుక్రవారం ఏం తేలనుందో