BJP Strategy: హ్యాట్రిక్ కొట్టేందుకు కమలనాథుల కదనోత్సాహం.. మూడు క్లస్టర్లుగా దేశం.. జులై నెలలో కీలక భేటీలు

నరేంద్రమోదీకి వ్యతిరేకంగా జట్టు కడుతూ వుంటే మరోవైపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహరచన వేగవంతం చేసింది. జులై నెలలో కీలక సమావేశాలను బీజేపీ ప్లాన్ చేసింది.

BJP Strategy: హ్యాట్రిక్ కొట్టేందుకు కమలనాథుల కదనోత్సాహం.. మూడు క్లస్టర్లుగా దేశం.. జులై నెలలో కీలక భేటీలు
PM Modi, Amith Shah, JP Nadda
Follow us
Rajesh Sharma

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 30, 2023 | 9:49 PM

BJP Strategy: ఓవైపు నరేంద్రమోదీకి వ్యతిరేకంగా జట్టు కడుతూ వుంటే మరోవైపు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహరచన వేగవంతం చేసింది. బీహార్ రాజధాని పాట్నాలో 15 విపక్ష పార్టీల నేతలు భేటీ అయి కొత్త అలయెన్స్ కూర్పునకు తొలి అడుగు వేశారు. మలి అడుగు కర్నాటక రాజధాని బెంగళూరులో పడబోతంది. ఇలాంటి కీలక తరుణంలో బీజేపీ అధినాయకత్వం కీలక సమాలోచనలు మొదలు పెట్టింది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ చేయడం ప్రారంభించింది. అదేసమయంలో దేశవ్యాప్తంగా త్రిశూల వ్యూహంతో కదిలి 2024 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే సంవత్సరం లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు 2023 సంవత్సరాంతంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతున్న తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ నజర్ పెట్టింది. ఇందులో భాగంగా జులై 1న బీజేపీ కీలక భేటీ జరగనున్నది. బీజేపీ జాతీయ కమిటీ, రాష్ట్రాల నాయకులు, వివిధ అనుబంధ సంస్థలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాలోచనలు జరపనున్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో తక్షణం ప్రారంభించాల్సిన కార్యక్రమాలపై ఈ ముగ్గురు దిశానిర్దేశం చేయనున్నారు. అదేసమయంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ అనుబంధ సంస్థలు అంతగా క్రియాశీలకంగా లేవు. మోర్చలన్నింటికీ చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించి, వారిని యాక్టివేట్ చేయబోతోంది బీజేపీ హైకమాండ్.

ఇక లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ అతి కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశాన్ని మూడు కోణాల్లో చూస్తూ త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. దేశాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి… దానికి అనుగుణంగా వ్యూహాలను అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాలను ఒక జట్టుగా చేయడం ద్వారా క్లస్టర్ల వారీగా కార్యాచరణ రూపొందించాలని భావిస్తోంది. క్లస్టర్ల వారీగా కీలకాంశాలను గుర్తించి, వాటిని అడ్రస్ చేస్తూ ప్రచార పర్వాన్ని నిర్వహించాలని తలపెట్టారు. అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ పూర్తిగా పార్టీ సంస్థాగత అంశాలపై దృష్టి సారించారు. ఆయన విదేశీ పర్యటనలో వున్న సమయంలో అమిత్ షా, నడ్డా పార్టీ నాయకులతో చర్చలు జరిపి ఓ ఎజెండాను రూపొందించగా.. ఆ ఎజెండా ఆధారంగా మోదీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ మంతనాల్లోనే త్రిశూల వ్యూహరచన జరిగినట్లు తెలుస్తోంది. దేశాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, ఎన్నికల ప్రణాళిక రచించాలని భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత షా తోపాటు బీజేపీ అగ్ర నాయకులతో జూన్ 28న అర్ధరాత్రి దాకా సర్వోన్నత స్థాయి భేటీ జరిపారు. సుమారు అయిదు గంటల పాటు సాగిన ఈ భేటీలో ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై, 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహాలతో పాటు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పార్టీలో సంస్థాగత మార్చుల కూడా సమాలోచనలు జరిగాయని తెలుస్తోంది. ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ కూడా హాజరయ్యారు. లోక్‌సభ,. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాంతాలు, సీట్ల వారీగా బ్లూప్రింట్‌ సిద్ధం చేయాలని పార్టీ అగ్ర నాయకులను మోదీ ఆదేశించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రయత్నాలను సులభతరం చేయడానికి దేశవ్యాప్తంగా వున్న 543 లోక్‌సభ స్థానాలను ఉత్తర, దక్షిణ, తూర్పు అనే మూడు క్లస్టర్లుగా విభజించాలని నిర్ణయించారు. వీటిలో ఒక్కో జోన్‌లోని ముఖ్యనేతలతో జేపీ నడ్డా జులై 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని తలపెట్టారు. జూలై 6న అసోం రాజధాని గువాహటిలో నిర్వహించే సమావేశంలో బీహార్‌, జార్ఖండ్‌, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌, అసోం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ సహా ఇతర ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతలు పాల్గొంటారు. జులై ఏడవ తేదీన ఢిల్లీలో జమ్ము-కశ్మీర్‌, లద్ధాఖ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌, చండీగఢ్‌, రాజస్థాన్, గుజరాత్, డామన్, డయ్యూ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులతో నడ్డా సమావేశమవుతారు.

మూడో క్లస్టర్‌గా దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్ సిటీలో నడ్డా సమావేశం నిర్వహించనున్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్ష్యద్వీప్, గోవా రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్య నాయకులతో నడ్డా సమాలోచనలు జరుపుతారు. ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి, రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు, కార్యదర్శి, అధికారంలో వుంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులను పిలవాలని నిర్ణయించింది బీజేపీ హైకమాండ్. పేద, వెనుకబడిన వర్గాల ప్రజల అవసరాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంపై జూన్ 28న జరిగిన సమావేశంలో పలువురు మంత్రులకు నరేంద్ర మోదీ నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికలు ఈ వర్గాల సంక్షేమం, ప్రయోజనాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తాయని, ప్రభుత్వ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం అంకితభావంతో ప్రయత్నించాలన్నారు. మంత్రులంతా తమ నియోజకవర్గాల్లో వెనుకబడిన తరగతుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి జీవన ప్రమాణాలను పెంచే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా ఎన్నికల సంవత్సరంలో మధ్య తరగతి, పేద, అణగారిన, వెనుకబడిన వర్గాల ప్రాముఖ్యతను గుర్తిస్తూ, వారి ఆందోళనలు, ఆకాంక్షలను పరిష్కరించే ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. ప్రజలందరికీ మంచి భవిష్యత్తును అందించడం, సమ్మిళిత పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో రాబోయే ఎన్నికలపై దృష్టి సారించాలని సమావేశంలో నేతలు సంకల్పించారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ రెడీ అయ్యింది. ఈ దిశగా వేసే అడుగులను జులై నెలలో వేగవంతం చేయబోతోంది బీజేపీ అధినాయకత్వం.