
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేటితో నామినేషన్ల దాఖలు గడువు ముగిసిపోయింది. ఒకట్రెండు రాష్ట్రాలు మినహా అనేక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. వాటిలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మొత్తం 56 స్థానాలు ఏప్రిల్ నెలతో ఖాళీ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్ విడుదల చేసి, నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ 56 స్థానాల్లో ఆయా రాష్ట్రాల్లో శాసన సభ్యుల సంఖ్యాబలం ప్రకారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలిచేందుకు ఆస్కారం ఉన్న 28 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పదవీకాలం ముగిసిపోతున్నవారిలో అరడజనుకు పైగా కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయాధ్యక్షులు సహా జాతీయస్థాయి నేతలున్నారు. అయితే వారిలో కేవలం నలుగురిని మాత్రమే మరో దఫా రాజ్యసభకు కొనసాగిస్తూ 24 కొత్త ముఖాలకు చోటు కల్పించింది.
కొనసాగింపు లభించినవారిలో బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్. మురుగన్‌తో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఉన్నారు. ఇదంతా ఒకెత్తయితే రాజ్యసభకు రీ-నామినేట్ కాని ముఖ్యనేతల జాబితా చాలా పెద్దగా ఉంది. ఆ జాబితాలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్, డా. మన్సుఖ్ మాండవియా, పరుషోత్తం రూపాల, నారాయణ్ రాణే, వి. మురళీధరన్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు అనిల్ బలూని (మీడియా విభాగం హెడ్), మాజీ మంత్రి ప్రకాశ్ జవడేకర్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ, బీజేపీ జాతీయా ఉపాధ్యక్షులు సరోజ్ పాండే సహా తెలుగు ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్ తదితరులున్నారు. వీరందరినీ ఎందుకు రీ-నామినేట్ చేయలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. మరో దఫా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ జాబితాలో నేతలకు మంత్రివర్గంలో చోటు లేదా అన్న సందేహం కూడా కలుగుతుంది. కానీ కమలనాథుల వ్యూహం మరోలా ఉంది. అదేంటంటే..
పెద్దల సభగా వ్యవహరించే రాజ్యసభకు ఎంపికయ్యేవారిలో పార్టీలో సీనియర్ నేతలు లేదా సొంత నియోజకవర్గం అంటూ లేకుండా పార్టీ కోసం సంస్థాగతంగా పనిచేసినవారైనా ఉంటారు. కొన్ని పార్టీల్లో భారీ విరాళాలు అందించే నేతలు కూడా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. రాజ్యసభ పదవులు అంటేనే నోట్ల కట్టల సూటు కేసులతో కొనుక్కునే పదవిగా ప్రాంతీయ పార్టీల్లో నానుడి. వాటి సంగతెలా ఉన్నా భారతీయ జనతా పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఉంటుంది. సుదీర్ఘ పాలనానుభవం కలిగిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఆలిండియా సర్వీస్ అధికారులను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న మోదీ సర్కారు.. ఆ మంత్రి పదవిలో కొనసాగించేందుకు వీలుగా వారిని వేర్వేరు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తూ వచ్చింది. కేంద్ర మంత్రులుగా ఉన్నవారు పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదో ఒక సభ నుంచి సభ్యుడిగా ఉండాలి. ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా 6 నెలలకు మించి పదవిలో ఉండడానికి వీల్లేదు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మాజీ బ్యూరోక్రాట్ల జాబితాలో విదేశాంగ శాఖ మంత్రిగా ఆ శాఖలోనే సుదీర్ఘకాలం పనిచేసి, ఫారిన్ సెక్రటరీగా పదవీ విరమణ పొందిన ఎస్. జైశంకర్ సహా ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి అశ్విని వైష్ణవ్, ఆర్కే సింగ్, హర్దీప్ సింగ్ పురి తదితరులున్నారు.
మరోవైపు మంత్రివర్గంలో అన్ని రాష్ట్రాల నేతలకు ప్రాతినిథ్యం కల్పించాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. కానీ బీజేపీకి అసలేమాత్రం పట్టు, ప్రాతినిథ్యం లేని రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో దక్షిణాదిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సీనియర్ నేతలను తమకు బలం ఉన్న రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి, వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటోంది. ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన ఎల్. మురుగన్, వి. మురళీధరన్ ఉన్నారు. ఈ ఏప్రిల్ నెలతో పదవీకాలం ముగుస్తున్న పలువురు కేంద్ర మంత్రులున్నప్పటికీ.. వారిలో కేవలం అశ్విని వైష్ణవ్, ఎల్. మురుగన్‌కు మాత్రమే మరో దఫా రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశం దక్కింది. మిగతా కేంద్ర మంత్రులు సహా రీనామినేషన్ అవకాశం లభించని రాజ్యసభ సభ్యులందరూ కూడా త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఆయా నేతలకు పార్టీ అధిష్టానం మూడేళ్ల క్రితమే చెప్పింది. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ విషయం చెప్పారు. ప్రతి రాజ్యసభ సభ్యుడు కనీసం ఒక్కసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, ఎన్నికల అనుభవాన్ని గడించాలని సూచించారు. ప్రతి సభ్యుడు తమ సొంత రాష్ట్రంలో ఒక నియోజకవర్గం చూసుకుని, అక్కడ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందలేకపోయిన నియోజకవర్గాల్లో రాజ్యసభ సభ్యులు గ్రౌండ్ వర్క్ చేసుకుని లోక్‌సభ అభ్యర్థులుగా బరిలోకి దిగాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన నివాసాన్ని విశాఖకు మార్చుకుని మరీ అక్కడ లోక్‌సభలో పోటీ కోసం గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే బాటలో అనేక మంది రాజ్యసభ సభ్యులున్నారు.
ఈ రాజ్యసభ ఎన్నికల్లో ప్రకటించిన 28 మందిలో 24 మంది కొత్తవారే. మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు మరింత పెంచేందుకు వీలుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసిన బీజేపీ సర్కారు, తాజా జాబితాలోనూ మహిళా నేతలకు చోటు కల్పించింది. మహిళా మోర్చాలో చురుగ్గా పనిచేసిన ధర్మశీల గుప్తకు బిహార్ నుంచి, మేధా కులకర్ణికి మహారాష్ట్ర నుంచి, మాయా నరోలియాకు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. మొత్తంగా 28 మందిలో ఐదుగురు మహిళలకు చోటు కల్పించడంతో పాటు సామాజిక సమీకరణాలకు కూడా పెద్దపీట వేసింది.
మరోవైపు ప్రతి రాష్ట్రంలో బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారుచేయాలని కమలనాథులు భావిస్తున్నారు. మోదీ, అమిత్ షాలు గుజరాత్ వీడి ఢిల్లీకి చేరుకున్న తర్వాత రాష్ట్రంలో నాయకత్వ లోపం కొన్నాళ్లు ఇబ్బందులు పెట్టింది. ఆ పరిస్థితి మరే రాష్ట్రంలో రాకుండా ఉండేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రులుగా కొత్తవారికి అవకాశం కల్పించింది. రాజస్థాన్ రాష్ట్రంలో వసుంధర రాజే నీడ నుంచి పార్టీని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలకు రాజ్యసభలో అవకాశం కల్పించి నాయకత్వాన్ని తయారు చేస్తోంది.
మరోవైపు ఈసారి రాజ్యసభ రీనామినేషన్ అవకాశం దక్కని కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యమైన నేతలకు సేఫ్ సీట్ల నుంచి బరిలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది. పరుషోత్తం రూపాల ను గుజరాత్‌లోని అమ్రేలీ లేదా రాజ్‌కోట్ నుంచి బరిలోకి దించవచ్చు. అలాగే మన్సుఖ్ మాండవియాను భావ్‌నగర్ లేదా పోర్‌బందర్ లేదంటే సూరత్ నుంచి పోటీకి నిలపవచ్చు. భూపేందర్ యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ లేదా హర్యానాలోని భివానీ-మహేంద్రగఢ్ నుంచి బరిలోకి దిగవచ్చని తెలుస్తోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు సరోజ్ పాండే చత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి, అనిల్ బలూని ఉత్తరాఖండ్‌లోని పౌడి గఢ్వాల్ నుంచి, మురళీధరన్ కేరళలోని అత్తింగల్ నుంచి పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ పోటీ నుంచి అశ్విని వైష్ణవ్ మినహాయింపు పొందారు. ఆయన రైల్వే, ఐటీ, టెలీకాం వంటి కీలకమైన శాఖలతో తలమునకలై ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే.. దాని ప్రభావం ఆయా మంత్రిత్వశాఖల పనితీరుపై కూడా పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావించినట్టు తెలుస్తోంది. ఇదే బాటలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా లోక్‌సభ పోటీ నుంచి మినహాయింపు పొందవచ్చు.
ఈ మొత్తం మార్పులు చేర్పుల కసరత్తుతో రాజ్యసభ ఎంపీలు లోక్‌సభ క్షేత్రంలో కొత్త ముఖాలుగా బరిలోకి దిగడం వల్ల ఆయా స్థానాల్లో గెలుపు అవకాశాలు కూడా మరింత మెరుగుపడతాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..