AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ముగ్గురి ఫొటోపై రాజకీయ రగడ.. డీఎంకే – బీజేపీ మధ్య మాటల యుద్ధం

తమిళనాడు సీఎం స్టాలిన్ రాహుల్ యాత్రలో పాల్గొనడం రాజకీయ విమర్శలకు తావిచ్చింది. స్టాలిన్, రాహుల్, తేజశ్వీ ఫొటోలను షేర్ చేసిన బీజేపీ ఆ ముగ్గురూ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఎటువంటి భవిష్యత్తు లేకుండా నిరాశలో ఉన్న రాజకీయ వారసులని సెటైరికల్ కామెంట్స్ చేసింది.

ఆ ముగ్గురి ఫొటోపై రాజకీయ రగడ.. డీఎంకే - బీజేపీ మధ్య మాటల యుద్ధం
Bjp Slams India Alliance
Krishna S
|

Updated on: Aug 28, 2025 | 9:18 AM

Share

బీహార్‌లో వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్‌లు చేపట్టిన ‘ఓటరు అధికార్ యాత్ర కొనసాగుతోంది. సెప్టెంబర్ 1వరకు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో తమిళనాడు సీఎం స్టాలిన్ పాల్గొనడంపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఆ ముగ్గురు అగ్ర నాయకుల ఫోటోను షేర్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ ముగ్గురూ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఎటువంటి భవిష్యత్తు లేకుండా నిరాశలో ఉన్న రాజకీయ వారసులని బీజేపీ ఎగతాళి చేసింది.

డీఎంకే – బీజేపీ ఎక్స్ వార్

స్టాలిన్ బీహార్‌లో అడుపెట్టిన వెంటనే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్‌లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘చోరి అయిన ప్రతి ఓటుతో నిండిన భూమి నన్ను మండే కళ్ళతో పలకరిస్తుంది’’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌పై వెంటనే బీజేపీ స్పందించింది. బీజేపీ నాయకుడు అన్నామలై ఆ పోస్టుకు సెటైరికల్‌గా స్పందించారు. ఈ ముగ్గురి ఫోటోను ట్యాగ్ చేసి.. నాకు మూడు నిరాశ నిండిన రాజకీయ వారసుల చిత్రాన్ని చూపించగలవా? అని చాట్‌జీపీటీని అడగ్గా.. అది రాహుల్, స్టాలిన్, తేజశ్వీ చిత్రాని చూపిస్తున్నట్లుగా ఉండే ఫొటోను ఇచ్చినట్లుగా అన్నామలై పోస్ట్ పెట్టారు. అంటే ఈ ముగ్గురూ రాజకీయ వారసులు, కానీ వారికి రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు లేదని అన్నామలై పరోక్షంగా విమర్శించారు.

రాజ్యాంగాన్ని కాపాడే యాత్ర..

మరోవైపు డీఎంకే ఎంపీ కనిమొళి ఈ యాత్రను ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉద్దేశించిన యాత్రగా అభివర్ణించారు. ఆమె ఈ ముగ్గురు నాయకుల ఫోటోను షేర్ చేస్తూ.. భారతదేశ భవిష్యత్తు అని కీర్తించారు. ‘‘మనం కలిసి నిలబడతాం, కలిసికట్టుగా పోరాడుతాం. బీజేపీ యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి బీహార్‌లో ఇండియా కూటమి చేతులు కలుపుతుంది’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చింది.

ఆ అవమానాలను మర్చిపోరు

అటు బీజేపీ సైతం తన విమర్శలకు మరింత పదును పెట్టింది. స్టాలిన్ బీహార్ పర్యటనను ఒక రాజకీయ కుట్రగా పేర్కొంది. గతంలో బీహారీ ప్రజల పట్ల డీఎంకే నాయకులు చేసిన అగౌరవకరమైన వ్యాఖ్యలను బీజేపీ గుర్తు చేసింది. ‘‘వారు బీహారీలను తెలివి తక్కువ అని పిలవడం నుండి ఉద్యోగాల నష్టాలకు వారిని నిందించడం వరకు, డీఎంకే చరిత్ర అగౌరవంతో కూడుకున్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కన స్టాలిన్ నిలబడడంతో బీహార్ ప్రజలు ఈ అవమానాలను మర్చిపోతారా’’ అని బీజేపీ తన ఎక్స్‌లో ప్రశ్నించింది. ఈ పర్యటన కేవలం డీఎంకే పార్టీ బిహారీ ప్రజల పట్ల చూపిన అసహ్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమేనని బీజేపీ ఆరోపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..