BJP PREPARATION: అన్ని పార్టీలు ఒకవైపు.. ఒక్క బీజేపీ ఒకవైపు.. అయిదు రాష్ట్రాల ఎన్నికలకు కాషాయదళం సంసిద్ధం

అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగిందో లేదో విజయావకాశాలపై ఏ పార్టీకి ఏ మేరకు అవకాశాలున్నాయనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది....

BJP PREPARATION: అన్ని పార్టీలు ఒకవైపు.. ఒక్క బీజేపీ ఒకవైపు.. అయిదు రాష్ట్రాల ఎన్నికలకు కాషాయదళం సంసిద్ధం
Bjp
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 10, 2022 | 8:57 PM

BJP STRONGEST PREPARATION FOR FIVE STATES ELECTIONS: అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగిందో లేదో విజయావకాశాలపై ఏ పార్టీకి ఏ మేరకు అవకాశాలున్నాయనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏ మాత్రం రాజకీయ పరిఙ్ఞానం వున్న నలుగురు కలిసినా యుపీలో ఎవరు గెలుస్తారు? పంజాబ్‌లో పరిస్థితి ఏంటి ? మిగిలిన మూడు చిన్న రాష్ట్రాలలో పరిస్థితి ఎవరికి అనుకూలంగా వుంది ? ఇలాంటి చర్చలు కామనైపోయాయి. రాజకీయ పార్టీల్లో కొన్ని కుటుంబ పార్టీలైతే.. కొన్ని నాయకుల బేస్డ్‌గా నడిచేవి వున్నాయి మన దేశంలో. కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా దాని ప్రత్యర్థులు కామెంట్ చేస్తూ వుంటారు. భారతీయ జనతా పార్టీ తొలినాళ్ళలో వాజ్‌పేయి, అద్వానీల పార్టీగా పిలవబడేది. 2004లో అధికారం కోల్పోయాక బీజేపీ నాయకత్వంలో మెల్లిగా మార్పొచ్చింది. 2010 తర్వాత బీజేపీకి నరేంద్ర మోదీ చరిష్మా జత కలిసింది. 2014 తర్వాత మోదీకి జోడుగా వ్యూహకర్త అమిత్ ‌షా కలిశారు. ఆయన అయిదేళ్ళ పాటు బీజేపీకి నాయకత్వం వహించిన తర్వాత వీరిద్దరికి జేపీ నడ్డా కలిశారు. ప్రస్తుతం ఈ ముగ్గురి కనుసన్నల్లో బీజేపీ అయిదు రాష్ట్రాల ఎన్నికలకు సంసిద్దమవుతోంది.

రాజకీయ పార్టీలు అన్న తర్వాత రకరకాల సంస్థాగత ఏర్పాట్లు ఉంటాయి. జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల దాకా దేనికది ప్రత్యేక విధానాలను పార్టీలు కలిగి వున్నాయి. కొన్ని అధినేతలు, అధినేత్రులపై ఆధారపడి పని చేస్తుంటే.. మరికొన్ని సిద్దాంత పరంగా నిర్దిష్టమైన మార్గదర్శకాలతో పని చేస్తూ వుంటాయి. ఈకోవలోకి కమ్యూనిస్టు పార్టీలు వస్తాయి. దాదాపు ఇదే విధానంలో బీజేపీ వున్నప్పటికీ.. ఈ పార్టీకి ఆర్ఎస్ఎస్ వంటి బలమైన సిద్దాంత పునాదితోపాటు.. మోదీ, అమిత్ షా వంటి తిరుగులేని చరిష్మా కలిగిన నేతలున్నారు. సంస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం, ఎవరి స్థాయిలో వారు పూర్తి డెడికేషన్‌తో పనిచేసే యంత్రాంగం, నిరంతరం ఏదో కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యేలా ప్రణాళికలతో పనిచేయడం, సూక్షస్థాయి ప్రణాళికలు, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అండదండలు… మొత్తం మీద బీజేపీ ఓ పటిష్టమైన సంస్థలా ఎక్కడా ఎలాంటి పొరపాట్లను తావివ్వకుండా ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అవుతూ వస్తోంది. అమిత్‌ షా అధ్యక్షుడిగా పనిచేసిన కాలం అంటే 2014 జులై 9 నుంచి 2020 జనవరి 20 వరకు అయిదేళ్ళ కాలంలో బీజేపీని సంస్థాగతంలో మరో లెవెల్‌కి తీసుకువెళ్ళారు అంటే అతిశయోక్తి కాదు.

18 కోట్లకు పైగా మెంబర్‌షిప్‌తో బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. ఆధునిక సాంకేతికను జోడించి, సోషల్‌ మీడియాను సంపూర్ణంగా వాడుకుంటూ బీజేపీ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి పనుల నుంచి… తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడం దాకా ఒక క్రమపద్ధతిలో బీజేపీ సమాచారాన్ని విరివిగా వ్యాప్తి చేస్తుంది. 18 కోట్ల మంది సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, చిరునామాలు, ఫోన్‌ నెంబర్లతో బీజేపీ దగ్గర డేటాబేస్‌ ఉంది. వృత్తులు, పార్టీ సభ్యుల ఇంట్రెస్టులను సేకరించి, వాటి ఆధారంగా సభ్యులను వర్గీకరించి, ఆ డేటాను రెడీ చేసింది బీజేపీ. వీరందరినీ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ చేయడంతోపాటు.. వారి అభిరుచులు, వారి శక్తి సామర్థ్యాల ఆధారంగా వారికి బాధ్యతలను అప్పగించింది బీజేపీ నాయకత్వం. పోలింగ్ బూత్‌ స్థాయిలో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పార్టీ మెంబర్లకు, నాయకులకు గైడ్‌లైన్స్ ఇస్తూ వుంటుంది బీజేపీ నాయకత్వం. మండల స్థాయిలో వీరికి క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు వీరు వివరిస్తూ వుంటారు. కేంద్రం పథకాలను, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను కార్యకర్తలకు వివరిస్తారు. వారు వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దాంతో పాటు గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులను పై స్థాయికి చేరవేస్తారు. ఇందుకు వాట్సప్ గ్రూపులను బీజేపీ బృందాలు విరివిగా వాడుకుంటాయి. దాంతో వ్యూహాల్లో ఎప్పటికప్పుడు మార్చుకునేందుకు బీజేపీ వర్గాలకు వీలు కలుగుతుంది. బీజేపీ జాతీయ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, రాష్ట్రాల యూనిట్ల పార్టీ అధ్యక్షులు… ఇలా ప్రతి ఒక్కరికి వారు పోషించాల్సిన నిర్దిష్ట పాత్ర ఉంటుంది. వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను బీజేపీ అభివృద్ధి చేసింది.

దాదాపు 8 వేల మంది పూర్తి సమయ కార్యకర్తలు బీజేపీకి వున్నట్లు సమాచారం. వీరంతా తమ వ్యక్తిగత సమయాన్ని పూర్తిగా పార్టీ కోసం, పార్టీ సిద్దాంత విస్తరణ కోసం, పార్టీ పనులను నిర్వహించేందుకుగాను వెచ్చిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున వీరు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు.. పార్టీ విస్తరణకు పాటుపడతారు. పైనుంచి వచ్చే ఆదేశాలను సమర్థమంతంగా కిందికి తీసుకెళతారు. ప్రస్తుతం జరగబోతున్న యుపీ అసెంబ్లీ ఎన్నికలను పురష్కరించుకొని… ఆ రాష్ట్రంలో 800 విస్తారక్‌లను మోహరించింది. ఉత్తరాఖండ్‌కు 120 మందిని, గోవా, పంజాబ్‌లకు వందేసి మంది విస్తారక్‌లను పంపింది. ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణాన్ని చూసి ఈ విస్తారక్‌ల విధానాన్ని అందిపుచ్చుకుంది బీజేపీ.

గతంలో బీజేపీకి పోలింగ్ బూత్ స్థాయికి ఒకరిని ఇంఛార్జీగా నియమించేది. వారి ద్వారా ప్రతీ ఓటరును కలిసేందుకు ప్రయత్నించేది. కానీ ప్రస్తుతం పరిధిని ఇంకాస్త లోతుకు విస్తరించింది బీజేపీ నాయకత్వం. పోలింగ్ బూతుల వారిగా ఓటర్ల జాబితాను తీసుకుని, అందులో ప్రతీ పేజీకి ఒకరు ఇంచార్జీగా వ్యవహరించేలా కార్యచరణను అమలు చేస్తోంది బీజేపీ. వీరిని ఉత్తరాదిన పన్నా ప్రముఖ్‌గా పిలుస్తోంది. పన్నా అంటే పేజీ అని అర్థం కాబట్టి వారిని మనం పేజీ లేదా పుట బాధ్యుడు అనొచ్చన్నమాట. దేశంలోని 10 లక్షల పైచిలుకు పోలింగ్‌ బూత్‌లలో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఒక ఇంచార్జిని నియమించే కార్యాన్ని బీజేపీ చేపట్టింది. ఓటరు జాబితాలోని ఒక్కో పేజీలో 30 మంది వరకు ఓటర్లు ఉంటారు. పన్నా పముఖ్‌ ఈ 30 ఓటర్లను లేదా తన పరిధిలోని ఐదారు కుటుంబాలను కలిసి బీజేపీకి ఓట్లు అభ్యర్థిస్తారు. తమ ప్రభుత్వాలు చేసిన పనులను వివరిస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఓటరు జాబితాలోని ప్రతి పేజీకి ఐదుగురు చొప్పున పన్నా సమితి (పుట సమితులు) లను వేయాలని బీజేపీ నిర్ణయించింది.

కరోనా వంటి కఠిన సమయంలో మోదీ ప్రభుత్వం యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలచిందంటూ బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. ఇందుకు అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని, పలు దేశాలు వ్యాక్సిన్ పంపిణీ చేసి పెద్దన్న పాత్ర పోషించిన విధానాన్ని బీజేపీ వర్గాలు ప్రముఖంగా చెబుతున్నాయి. వాటితోపాటు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, నోట్ల రద్దు ప్రయోజనాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, అయోధ్య రామ మందిర నిర్మాణం, కశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలను ప్రజల్లోకి ఈ పుట ప్రముఖులు విస్తృతంగా తీసుకువెళ్ళనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే… 2021లోనే బీజేపీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు వీలుగా కరోనా వంటి కఠిన మైన కాలాన్ని కూడా బీజేపీ వృధా చేయలేదు. ఆజాదీగా అమృత్ మహోత్సవ్ పేరిట స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న తరుణాన్ని వినియోగించుకుని ప్రజలతో మమేకమయ్యేలా ప్లాన్ చేసింది బీజేపీ. దాంతోపాటు పబ్లిక్ లైఫ్‌లో అంటే ముఖ్యమంత్రిగాను, ప్రధాన మంత్రిగాను నరేంద్ర మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని హైలైట్ చేస్తూ.. సేవా హి సంఘటన్‌ ప్రచారాన్ని చేపట్టింది. వీటికి తోడు ఇటీవలనే జన ఆశీర్వాద్ యాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది.

సాధారణంగా ఎన్నికలు వచ్చినపుడే రాజకీయ పార్టీల్లో హడావుడి కనిపిస్తుంది. కానీ బీజేపీ అలా కాదు. సోషల్‌ మీడియాలో సిద్ధాంత వ్యాప్తి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాధించిన విజయాలకు విస్తృత ప్రచారం కల్పించడం, కార్యకర్తలకు శిక్షణ… వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. నిబద్ధత, అంకితభావం కలిగిన కార్యకర్తలు బీజేపీ బలం. సూక్ష్మస్థాయిలో ప్లానింగ్ చేయడమే కాదు వాటి అమలు కూడా పక్కాగా ఉంటుంది. ఈ లక్షణాలు వీరికి ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీ నేర్చుకందని చెప్పాలి. తాము పనిచేస్తున్న సంస్థ (పార్టీ) కోసం తమ సర్వస్వాన్ని త్యజించి, భవబంధాలను తెంచుకొని పూర్తిస్థాయిలో దేశమంతా కలియ తిరిగే నాయకులు, ప్రచారక్‌లు బీజేపీలో ఎందరో ఉన్నారు. ఈ రకమైన నిర్మాణంతో బీజేపీ… భారత రాజకీయ యవనికపై అత్యంత బలమైన పునాదులు కలిగిన పార్టీగా ఎదిగింది. వరుసగా రెండుమార్లు కేంద్రంలో అధికారం చేపట్టింది. మూడోసారి 2023లో పగ్గాలు చేపట్టేలా పక్కా ప్రణాళికతో, వ్యూహాలతో బీజేపీ అధినాయకత్వం రెడీ అవుతోందనే చెప్పుకోవాలి. అయితే రాజకీయ విశ్లేషకులు.. 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే బీజేపీ వ్యూహాల్లో మార్పులు, చేర్పులు జరిగే సంకేతాలున్నాయి. ఎందుకంటే యుపీతోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ వంటి నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో వుంది. యుపీలో ఏకంగా 403 అసెంబ్లీ సీట్లు.. 80 లోక్‌సభ సీట్లు వున్నాయి. దీంతో ఈ సెమీఫైనల్ వంటి పాంచ్ పటాకాలో విజయం సాధించేందుకు బీజేపీ సర్వ శక్తులు ఒడ్డనున్నది. అందుకు తమ పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని సమర్థవంతంగా వాడుకోనున్నది.