రాజ్యసభ సీట్లపై కమలం కన్ను
రాజ్యసభలో బీజేపీకి తక్కువ సీట్లున్నాయి. బిల్లులు ఆమోదం పొందాలంటే మరింత బలం అవసరం. కొన్ని బిల్లులు ఆమోదం కోసం ఇతరుల పై ఆధారపడాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో బీజేపీ సీట్లు మరింతగా..
రాజ్యసభలో బీజేపీకి తక్కువ సీట్లున్నాయి. బిల్లులు ఆమోదం పొందాలంటే మరింత బలం అవసరం. కొన్ని బిల్లులు ఆమోదం కోసం ఇతరుల పై ఆధారపడాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో బీజేపీ సీట్లు మరింతగా తగ్గనున్నాయి. అందుకే ముందస్తు కసరత్తులు చేస్తోంది కమలం పార్టీ. ఇందులో భాగంగా తమకు కలిసొచ్చే ఏ అంశాన్ని వదలడం లేదు. రానున్న ఏప్రిల్‌లో 51 సీట్లు ఖాళీ అవ్వనున్నాయి. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఎక్కువ సీట్లు కోల్పోనున్నాయి. బీజేపీ నుంచి 18 సీట్లు ఖాళీ అవుతుండగా, ఆ పార్టీ నుంచి 13 మంది మాత్రమే మళ్లీ ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఖాళీ అయ్యే సీట్లల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి అయిదుగురు, బిజూ జనతాదళ్, ఆర్‌జేడీ, జేడీ(యూ), ఎన్‌సీపీల నుంచి ఇద్దరు చొప్పున, శివసేన, డీఎంకే, జేఎంఎంల నుంచి ఒక్కొక్కరు చొప్పున తిరిగి ఎన్నిక కానున్నారు. ఇక కాంగ్రెస్ సభ్యులు 11 మంది రిటైర్ అవుతుండగా, తిరిగి 10 మందే ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కోటా నుంచి కే. కేశవ రావు, తోట సీతారామ లక్ష్మీ, సుబ్బిరామిరెడ్డి, ఏం. ఏ ఖాన్‌లు, తెలంగాణ కోటా నుంచి కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్ రావుల సీట్లు ఖాళీ అవుతున్నాయి.
కుర్చీకా కిస్సా త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్ల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 16 న నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేది. మార్చి 26 న పోలింగ్ జరగనుండగా… అదే రోజున లెక్కింపు జరుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆ ఆరు సీట్లను దక్కించుకోనున్నాయి. రెండు స్థానాలు అధికార టిఆర్ ఎస్ పార్టీ కే దక్కనున్నాయి. గులాబీ పార్టీకి దక్కనున్న రెండు సీట్లకు బాగానే పోటీ ఉంది. సీనియర్ నేత కే. కేశవరావు తిరిగి ఎంపికయ్యేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి మాజీ ఎంపీ కవిత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. అంతే కాదు.. ఖమ్మం నుండి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ నుండి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా.. కరీంనగర్ నుండి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. గులాబీ పార్టీ నుంచి ఎంపికయ్యే ఇద్దరు అభ్యర్థులను మార్చి మొదటి వారంలోనే సీఎం కేసీఆర్ ఖరారు చేస్తారని తెలుస్తోంది.
ఏపీలో సంగతేంటి… ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు సీట్ల కోసం ఎన్నడూ లేనంత పోటీ నెలకుంది. శాసనమండలి రద్దు అయితే మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల సీట్లకు ఎసరు వస్తోంది. అందుకే వారిని రాజ్యసభకు పంపించే ఆలోచన చేస్తున్నారట సీఎం జగన్మోహనరెడ్డి. వారిలో ఒక్కరికే సీటు ఇస్తారా.. లేదా ఇద్దరికా అనేది ఇంకా తేలలేదు. మరోవైపు ప్రముఖ పారిశ్రామిక వేత్త అయోధ్య రామిరెడ్డి పేరు బాగా వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు అయోధ్య రామిరెడ్డి. మరోసారి పోటీ చేయకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఆయన పేరును పరిశీలిస్తోంది వైసీపీ. అలానే ప్రకాశం జిల్లాలో టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వచ్చిన బీద మస్తాన్ రావు పేరు తెరపైకి వచ్చింది. పార్టీ మారేటప్పుడే ఆయనకు హామీ వచ్చిందనే చర్చ సాగుతోంది. బీసీ వర్గానికి చెందిన ఆయనకు సీటు ఇస్తే ఆ మేరకు తమ పార్టీకి ప్లస్ అవుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. అలానే సినీనటుడు చిరంజీవి పేరు రాజ్యసభ సీట్ల పరిశీలనలో ఉందనే చర్చ జరుగుతోంది. తమ్ముడు పవన్ కల్యాణ్ సీఎం జగన్ తీరు పై ధ్వజమెత్తుతుంటే. .అన్నయ్య చిరు… జగన్ పాలన బాగుందని కితాబునిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అన్నదమ్ముళ్లు ఇద్దరు చెరో దారిన వెళుతున్నారు. మూడు రాజధానులు మంచిదే అని చిరంజీవి అంటుంటే.. అమరావతి నుంచి రాజధానిని మార్చవద్దంటున్నారు ఇంకోవైపు జనసేన అధినేత పవన్. కాపు సామాజిక వర్గానికి పెద్ద పీట వేయాలనుకుంటే చిరంజీవిని ఆహ్వానించి రాజ్యసభ సీటు ఇస్తారనే చర్చ వైసీపీలో సాగుతోంది. సైరా సినిమా విడుదలను పురస్కరించుకుని చిరంజీవి కుటుంబ సభ్యులు.. సీఎం జగన్ వద్దకు వెళ్లిన సంగతిని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు విశ్లేషకులు.
ఒకటి వేరే వాళ్లకి.. బీజేపీ, వైసీపీ సంబంధాలు గతం కంటే బలంగా తయారయ్యాయనేది ఇరు పార్టీల నేతలు చెబుతున్న మాట. జనసేనతో బాహాటంగానే సయోధ్య ఉన్నప్పటికీ ఏపీలో వైసీపీని కాదని పోయే ఆలోచన చేయడం లేదట కమలం పార్టీ. ఇటీవల మోదీ-జగన్‌ల మధ్య జరిగిన భేటీ సందర్భంగా రాజ్యసభ సీటు విషయంపై చర్చ జరిగిందనే వాదనుంది. ఆ తర్వాత సీఎం జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన చర్చల్లో సీటు సంగతి తేలిందంటున్నారు కమలం నేతలు. ఏపీ కోటాలో రాజ్యసభ సీట్లను గతంలో మిగతా రాష్ట్రాల నేతలకు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభులు అలా ఏపీ నుంచి ఎంపికై చట్టసభల్లో అడుగు పెట్టారు. ఈ సారి అలానే ఒక సీటు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏపీలోని నాలుగు సీట్లలో కమలనాథుల కోసం ఒక సీటు త్యాగం చేస్తారనే సంకేతాలొస్తున్నాయి. ఇందుకు జగన్ అంగీకరిస్తారా లేక తమ పార్టీ వారినే ఎంపిక చేస్తారా అనేది తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
కొండవీటి శివనాగ్ రాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ9