ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ మధ్య రాజీ ప్రయత్నాలు ఫలించలేదు. ఇటీవల నితీశ్ కుమార్‌తో ఆయన నివాసంలో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిందన్న కథనాల నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ ద్వారా ఇద్దరి మధ్య రాజీ కుదిరే అవకాశముందని అందరూ భావించారు. అయితే ఈ భేటీ తర్వాత కూడా మునుపటిలానే నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ ఘాటైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అటు ప్రశాంత్ కిషోర్‌పై జేడీయు నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్‌పై జేడీయు అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పనిచేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో చేపడుతున్న ‘జన్ సురాజ్’ పాదయాత్రకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నితీశ్ కుమార్ పాలనలో గత దశాబ్ధకాలంలో బీహార్ ఎంతో పురోగతి సాధించిందన్నారు. ఆ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా బాగా తెలుసన్నారు. అయితే ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ నుంచి తమకు సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. అయితే ఇతర పౌరుల్లానే యాత్రలు, ప్రదర్శనలు చేసే హక్కు ప్రశాంత్ కిషోర్‌కు ఉందన్నారు.
నితీశ్ కుమార్ పాలనను విమర్శిస్తూ చేస్తున్న పాదయాత్రకు ప్రశాంత్ కిషోర్ ఏం పేరు పెట్టుకున్నా.. ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోందని విమర్శించారు. బీజేపీకి అనుకూలమైన ప్రచారం ఆయన చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద రాజకీయ పార్టీలు కూడా వార్తా పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వరని.. అయితే ప్రశాంత్ కిషోర్ తన పాదయాత్రకు భారీ ఎత్తున యాడ్స్ ఇచ్చుకున్నారని గుర్తుచేశారు. దీనికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో.. ఐటీ శాఖతో పాటు సీబీఐ, ఈడీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉన్నందునే ఐటీ శాఖ, సీబీఐ, ఈడీలు ప్రశాంత్ కిషోర్‌కు ఎక్కడి నుంచి నిధులు సమకూరుతున్నాయో పట్టించుకోవడం లేదని అనుమానం వ్యక్తంచేశారు.
అంతకు ముందు ప్రశాంత్ కిషోర్‌పై బీజేపీ నేతలు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. ప్రశాంత్ కిషోర్ నితీశ్ కుమార్ కోసం పనిచేస్తున్నారంటూ బీహార్ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ బ్రోకర్‌గా ధ్వజమెత్తారు. నితీశ్ కుమార్‌తో ఆయనకు లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ చేస్తున్న రాజకీయ విమర్శల్లో చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
మరిన్ని జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్..