RCB: బెంగళూరు తొక్కిసలాట.. సీఎం, డిప్యూటీ సీఎంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు!
ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవంలో బెంగళూరులో తొక్కిసలాట సంభవించి 11 మంది మరణించారు. విధాన సౌధ వద్ద జరిగిన సత్కారం, చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన వేడుకలకు భారీ జనం తరలిరావడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. దీనిపై సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ట్రోఫీ గెలిచింది. దీంతో బెంగళూరులోని విధాన సౌధా, చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ చూసేందుకు ఆర్సీబీ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఈ విజయోత్సవం విషాదంగా మారింది. స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. ఈ భయంకరమైన విషాదం నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , డీకే శివకుమార్ సహా కెఎస్సిఎ అధికారులపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజల్లో ఉన్న ఎమోషన్‌ను రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు విధాన సౌధ ముందు RCB ఆటగాళ్లను సత్కరించడం, చిన్నస్వామి స్టేడియంలో వారి విజయాన్ని జరుపుకోవాలనే తొందరపాటు నిర్ణయం, సరైన భద్రతను నిర్లక్ష్యం చేయడం వలన సుమారు 11 మంది మరణించారు.
30 మందికి పైగా గాయపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషాదానికి కారణమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ బోర్డు ఆఫీస్ బేరర్లు మరియు ఇతరులపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 106 కింద కేసు నమోదు చేసి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. తొక్కిసలాట విషాదం నేపథ్యంలో న్యాయవాది నటరాజ శర్మ కూడా ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విధానసౌధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు.
ఈ కేసుకు సంబంధించి బెంగళూరులో హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర ఒక ప్రకటన చేస్తూ తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిందని ఆయన అన్నారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 11 మంది మరణించారు. ఈ ఘటనలో 56 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో 46 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 10 మందికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




