కర్ణాటకలో మరో మఠాధిపతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని రామనగర జిల్లా, మాగడి సమీపంలోని కెంపపురా గ్రామంలో శ్రీ కంచుగల్ బండే మఠాధిపతి బసవలింగ స్వామి (44) సోమవారం ఉదయం పూజా మందిరం కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో శిష్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నేలమంగళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మఠానికి అప్పగించారు.
కాగా శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం ముందు ఉన్న పూజా గృహంలో బసవలింగ స్వామి నివాసం ఉండేవారు. రోజూ తెల్లవారుజామున నిద్రలేచి పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల 10 నిముషాల ప్రాంతంలో మఠం ఉద్యోగి అంబరీష్ స్వామీజీ తన గది తలుపులు తీయడంలేదని, ఫోన్ కాల్స్ సైతం సమాధానం ఇవ్వడం లేదని బాండే మట్ పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్‌కు శిష్యులు ఫోన్‌లో చెప్పారు. అక్కడికి చేరుకున్న రమేష్ గది వెనుకకు వెళ్లి చూడగా.. కిటికీ గ్రిల్‌కి వేలాడుతూ కనిపించినట్లు పోలీసులకు తెలిపాడు.
సంఘటన స్థలంలో పోలీసులు మూడు పేజీల సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. కొందరు తన వ్యక్తిత్వాన్ని తప్పుపట్టారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. సదరు వ్యక్తుల పేర్లను సైతం నోట్‌లో తెలిపారు. విచారణ కొనసాగుతున్నందున ఆయా వ్యక్తుల పేర్లను పోలీసులు వెల్లడించలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని రామనగర ఎస్పీ సంతోష్‌బాబు మీడియాకు తెలిపారు. కొందరు వ్యక్తులు స్వామీజీని గత కొంతకాలంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కోణంలో స్వామీజీ సన్నిహితులను, నిరంతరం ఫోన్‌లో టచ్‌లో ఉన్న వారిని విచారిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
చిలుమే మఠాధిపతి బసవలింగ స్వామి గత ఏడాది డిసెంబర్ 19న తన మఠంలో కిటికీ గ్రిల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జరిగి ఏడాదికాకముందే అదే రీతిలో కంచుగల్ బండే మఠాధిపతి బసవలింగ స్వామి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా 400 ఏళ్లనాటి ఈ మఠానికి ప్రధానపీఠాధిపతిగా 1997లో నియామకమయ్యారు. సుదీర్ఘకాలం పీఠాధిపతిగా వ్యవహరించిన బసవలింగ స్వామి కొన్ని నెలల క్రితం రజతోత్సవాన్ని సైతం జరుపుకున్నాడు.