బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తారతోరణం, రెండుగా చీలిన టోలీవుడ్ : Bengal Elections 2021
ఒకప్పుడంటే రాజకీయపార్టీలకు సిద్ధాంతాలు ఉండేవి. అధికారం కోసం సిద్ధాంతాలకు పాతర వేసేవి కావు.. నిబద్ధతతో ప్రజల ముందుకు వెళ్లేవి. ప్రతి రాజకీయపార్టీకి ఓ గ్రామర్ ఉండేది.. ఇప్పటి రాజకీయపార్టీలు అధికారంలోకి...
ఒకప్పుడంటే రాజకీయపార్టీలకు సిద్ధాంతాలు ఉండేవి. అధికారం కోసం సిద్ధాంతాలకు పాతర వేసేవి కావు.. నిబద్ధతతో ప్రజల ముందుకు వెళ్లేవి. ప్రతి రాజకీయపార్టీకి ఓ గ్రామర్ ఉండేది.. ఇప్పటి రాజకీయపార్టీలు అధికారంలోకి రావడమే అంతిమలక్ష్యంగా పెట్టుకున్నాయి.. అందుకు అనేక అడ్డదార్లు తొక్కుతున్నాయి.. అలవికాని హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఉచితాలతో హోరేత్తిస్తున్నాయి. ఇక కొన్ని పార్టీలైతే గ్రామర్‌ను కాదని గ్లామర్‌ను నమ్ముకుంటున్నాయి.. సినీరంగ ప్రముఖులను అక్కున చేర్చుకుంటున్నాయి.. విచిత్రమేమిటంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేజిక్కించుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకోసం అన్ని దారులలో పయనిస్తోంది.. అందులో ఒకదారి సినీరంగం.. మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో ఇంతకు ముందే చాలా మంది సినీ ప్రముఖులు చేరారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ గ్లామర్ ఉంది.. అధికారంలో లేనప్పుడే సినీ రంగం మమతకు బాసటగా నిలిచింది. మమత చేపట్టిన సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాలకు సినీరంగం మద్దతు పలికిన విషయాన్ని విస్మరించకూడదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో సినీ రంగంలోకి వారికి అవకాశాలు ఇస్తూ వస్తున్నారు మమతా బెనర్జీ. అయితే సినీరంగం నుంచి వచ్చినవారికి సిద్ధాంతలు గట్రాలు ఉండవన్న సంగతి దీదీ ఆలస్యంగా తెలుసుకున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత అప్పటి వరకు తృణమూల్‌ను అంటిపెట్టుకుని ఉన్న సినిమావాళ్లు నెమ్మదిగా బీజేపీ వైపుకు వెళ్లసాగారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ కప్పదాట్లు మరింత ఎక్కువయ్యాయి.. ఎన్నికల వేళ టోలీవుడ్ ఇప్పుడు రెండు ముక్కలయ్యింది. బెంగాల్ చిత్ర పరిశ్రమను టోలీవుడ్ అనే అంటారు.. కారణం కోల్‌కత్తాలోని టోలిగంజ్‌లోనే సినిమా పరిశ్రమ ఉండటం! ఈ రెండు వర్గాలలో ఓ వర్గమేమో తృణమూల్ కాంగ్రెస్ వైపు నిలబడింది.. మరోవర్గమేమో కమలానికి సలాం కొడుతున్నది. ఆడపులి మమతా బెనర్జీని ఎదుర్కోవాలంటే బీజేపీకి ఆ మాత్రం గ్లామర్ అవసరమే! సినిమావాళ్ల వల్ల ఓట్లు పడతాయా అంటే చెప్పలేం! గ్యారంటీ ఏమీ లేదు. మిథున్ చక్రవర్తిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీకి కొద్దిపాటి లాభం ఉంటే ఉండవచ్చు.. మిథున్ చక్రవర్తికి ఓ స్టాండ్ అంటూ లేదన్న విషయం బెంగాలీవాళ్లకే కాదు మనకూ తెలుసు.. ఆయన రాజకీయ ప్రస్థానం నక్సలైట్ ఉద్యమం నుంచి ప్రారంభమయ్యింది.. అటు పిమ్మట లెఫ్ట్ పార్టీలకు సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.. చేరడమే కాదు.. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు.. ఇప్పుడేమో బీజేపీలో చేరారు.. అన్నట్టు మిథున్ కొడుకుపై ఓ రేప్ కేసు ఉంది.. అందుకోసమే మిథున్ బీజేపీలో చేరారని చెప్పడం కాదు కానీ మొత్తానికి ఏదో ఆశించే మిథున్ ఆ పార్టీలో చేరారన్నది టాక్! బెంగాల్ బీజేపీలో ఇప్పుడు తళుకు బెళుకు తారలకు, మెరుపులకు కొదవే లేదు. యశ్‌దాస్ గుప్తా, హిరేన్ ఛటర్జీ, రుద్రానిల్ ఘోష్, పాయల్ సర్కార్, స్రవంతి ఛటర్జీ, పాపియా అధికారి .. ఇలా చాలా మంది బీజేపీ కండువా వేసుకుని తిరుగుతున్నారు. రూప గంగూలీ, బాబుల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీలు చాలా కాలం కిందటే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుల్లితెర నటీనటులు కూడా బీజేపీకి ప్రచారం చేస్తున్నారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌కు సంబంధించినంత వరకు బీజేపీ అనూహ్య ఫలితాలను సాధించింది.. ఇక మమతా బెనర్జీ కథ ముగిసిందనే భావనకు వచ్చిన కొందరు తారలు ముందుజాగ్రత్తగా బీజేపీలో చేరారు. ఇందులో రిమామ్ మిత్రా, అంజనా బసు, కాంచన మెయిత్రాలు ముఖ్యులు.
బెంగాల్‌కు ఘనమైన సాంస్కృతిక వారసత్వం ఉంది. అక్కడి సాహిత్యమూ గొప్పదే! మొదట్లో కాంగ్రెస్ పాలన ఉన్నా తర్వాత చాలా కాలం వామపక్షాలు రాజ్యమేలాయి. మమతా బెనర్జీ ఆ కంచుకోటను బద్దలు కొట్టేంత వరకు లెఫ్ట్ కూటమి పాలన సాగింది.. లెఫ్ట్ ఏలుబడిలో ఉన్నప్పుడు బెంగాలీ సాహిత్యం, సినిమాల్లో ఎరుపు వాసనలు వచ్చాయి.. ఆ తర్వాత చాలామంది సాహితీవేత్తలకు, సినీ రంగ ప్రముఖులకు మొహంమొత్తింది.. వారంతా మమతాబెనర్జీకి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ నుంచే తపస్‌పాల్, శతాబ్దిరాయ్‌లు లోక్‌సభలో అడుగు పెట్టారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీత్, దేవశ్రీరాయ్‌లు గెలుపొంది ఎమ్మెల్యేలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దీపక్ అధికారి, మిమి చక్రవర్తి, సుస్రత్ జహాన్, శతాబ్దిరాయ్, మున్‌మున్‌సేన్, రచయిత అర్పితా ఘోష్ తృణమూల్ నుంచి పోటీ చేశారు. అయితే ఇందులో దీపక్ అధికారి, సుస్రత్ జహాన్, శతాబ్దిరాయ్‌లు మాత్రమే విజయం సాధించారు. ఆ ఎన్నికల్లోనే బీజేపీ తరఫున పోటీ చేసిన నటి లాకెట్ ఛటర్జీ విజయం సాధించారు. వామపక్ష సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. బాద్షా మొయిత్రా, అనిక్ దత్తా, సవ్యసాచి చక్రవర్తి, కమలేశ్వర్ ముఖర్జీ, తరుణ్ మజుందార్, శ్రీలేఖా మిత్రాలు ఇప్పటికీ లెఫ్ట్ పార్టీతోనే ఉన్నారు. బెంగాల్‌లోనే కాదు, కేరళలో కూడా సీనియర్ నటుడు సురేశ్ గోపీకి టికెట్ ఇచ్చింది బీజేపీ. త్రిసూర్ నుంచి సురేశ్ గోపీ పోటీ చేస్తున్నారు. ఇక తమిళనాడులో ఖుష్బూను ధౌసండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీకి దింపుతున్నది బీజేపీ. అసోంలో సీని దర్శకురాలు సుమన్ హరిప్రియకు టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం.
మరిన్ని చదవండి ఇక్కడ : శోభనానికి అంగీకరించని భార్య ఆరాతీస్తే విస్తుపోయే నిజాలు.. షాక్ అయిన భర్త..! : Wedding viral Video ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోగలరా ?ట్రై చేయండి..ఈ ఫన్నీ వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి.:Funny Video ఒక్క ఫోన్‌కాల్… అడ్డంగా బుక్కైన యువతి ఇంత సులభంగా అంత మోసం.: woman Loss 6.4 Lakhs Video.