జనవరి 14 నుంచి రాహుల్ భారత్ న్యాయయాత్ర ప్రారంభం.. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్‌గాంధీ భారత్ న్యాయయాత్ర చేపట్టబోతున్నారు. మణిపూర్‌లో జనవరి 14న ప్రారంభమయ్యే యాత్ర మార్చి 20వ తేదీన ముంబైలో ముగుస్తుంది. రాహుల్‌గాంధీ ఎన్ని యాత్రలు చేసినా కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని బీజేపీ విరుచుకుపడుతోంది.
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ మరోసారి జోడో యాత్ర చేయబోతున్నారు. భారత్ న్యాయయాత్ర పేరుతో ఈ యాత్ర సాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ యాత్ర సాగనుంది. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ యాత్ర ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. భారత్ న్యాయయాత్రలో బస్సు యాత్రతో పాటు పాదయాత్ర కూడా ఉంటుంది. భారత్ న్యాయయాత్ర మొత్తం 6,200 కిలోమీటర్లు ఈ యాత్ర ఉంటుందని.. 14 రాష్ట్రాల మీదుగా 84 జిల్లాల్లో సాగుతుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. యువతతో పాటు అన్ని వర్గాలను ఈ యాత్రలో రాహుల్ గాంధీ కలుస్తారని తెలిపారు.
ఇక గతంలోనూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన ఈ పాదయాత్ర 12 రాష్ట్రాల మీదుగా సాగింది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, 75 జిల్లాల మీదుగా 145 రోజులపాటు ఈ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ మొత్తం 4 వేల కిలోమీటర్లు నడించారు. ఈ ఏడాది జనవరి 30న జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసింది.
భారత్ జోడో యాత్ర తరహాలోనే తూర్పు నుంచి పశ్చిమ భారత్ ప్రాంతాలు కవర్ అయ్యేలా రాహుల్ గాంధీ యాత్ర చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తాజాగా భారత్ న్యాయ యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..