అయోధ్యలో అతిపెద్ద, అధునాతన మసీదు నిర్మాణానికి అడ్డంకి తొలగిపోయింది. బాబ్రీ మసీదు – రామజన్మభూమి తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలోని ధన్నీపూర్ మసీదు నిర్మాణానికి అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ తుది క్లియరెన్స్ ఇచ్చింది. యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాల స్థలంలో ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మసీదు, ఆసుపత్రి, పరిశోధనా సంస్థ, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీ, మ్యూజియంని నిర్మించనున్నారు. తాజాగా జరిగిన అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ బోర్డు సమావేశంలో అయోధ్య మసీదు ప్రాజెక్టును ఆమోదించింది.
అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కన, దన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం ప్రారంభం కానుంది. స్థలాన్ని మసీదు నిర్మాణానికి వినియోగించుకునేందుకు అనుమతి కోసం ఎంతో కాలంగా చూస్తున్నామని, ఎట్టకేలకు అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ నుంచి అనుమతి వచ్చిందని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ ప్రకటించారు. ధన్నిపూర్ మసీదు.. బాబ్రీ మసీదు కంటే పెద్దదిగా ఉంటుందన్నారాయన.
దన్నీపూర్‌లో మసీదు నిర్మాణం ఒక్కటే కాకుండా, 200 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు ఐఐసీఎఫ్ సెక్రటరీ హుస్సేన్ తెలిపారు. ప్రవక్త బోధించిన ఇస్లాం యొక్క నిజమైన స్ఫూర్తితో రాబోయే ఆస్పత్రి మానవాళికి సేవ చేస్తుందన్నారు. ఈ మసీదుకు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మౌల్వి అహ్మదుల్లా షా పేరు పెట్టనున్నట్లు తెలిపారు. మొత్తానికి మసీదుకు సంబంధించి వెలుగులోకి వచ్చిన డిజైన్ ఎంతో అధునాతనంగా, ఆకర్షణీయంగా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..