
Assam Madarsa: అల్‌ఖైదాతో సంబంధమున్న మదర్సాలపై ఉక్కుపాదం మోపుతోంది అసోం సర్కార్. ప్రభుత్వం 3 మదర్సాలను కూల్చివేసింది. అయితే ఇప్పుడు స్థానికులే మదర్సాలను ధ్వంసం చేయడం సంచలనంగా మారింది. అవును, అసోంలో మదర్సాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అల్-ఖైదా ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో మూడు మదర్సాలను బుల్డోజర్లతో ప్రభుత్వం తొలగించగా.. ఇప్పుడు స్థానికులు సైతం రంగంలోకి దిగారు. ఓ మదర్సాను స్థానికులే కూల్చివేశారు.
గోపాల్‌పర జిల్లా పఖియురా చార్ ప్రాంతంలోని మదర్సాతో పాటు దాని పక్కనే ఉన్న ఓ ఇంటిని కూడా ధ్వంసం చేశారు స్థానికులు. ఇద్దరు బంగ్లాదేశీయులు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారిద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. అయితే మదర్సాల కూల్చివేతపై స్పందించారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. ధ్వంసమైన మదర్సాలన్నీ మదర్సాలు కాదని, అల్‌ఖైదా కార్యాలయాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మదర్సాలు మాకొద్దంటూ వాటిని కూల్చేసేందుకు ప్రజలే ముందుకొస్తున్నారంటూ కామెంట్ చేశారు సీఎం.
మరోవైపు ప్రజలు జిహాదీ కార్యకలాపాలకు మద్దతివ్వమని ముష్కరమూకలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారన్నారు గోల్‌పారా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివి రాకేష్ రెడ్డి. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, రాష్ట్రంలో జీహాదీ స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలతో నెల రోజుల వ్యవధిలో నాలుగు మదర్సాలను కూల్చివేశారు. యువతను ఉగ్రవాదులుగా మార్చేందుకు ఇద్దరు అల్-ఖైదా సభ్యులను మదర్సాలో బోధన కోసం నియమించారనే ఆరోపణలతో మతపెద్ద జలాలుద్దీన్ షేక్‌ను గత నెలలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మదర్సాల్లో ఉపాధ్యాయులు రాష్ట్రం బయట నుంచి వస్తే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో తమకు తాముగా పేర్లు నమోదుచేయాల్సి ఉంటుందని చెప్పారు సీఎం హిమంత బిశ్వ శర్మ. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ అసోంలో 40 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..