Assam Elections 2021: అసోం అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు.. 70 మందితో కూడిన తొలి జాబితా విడుదల
అసోంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధికార భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. 70 మందితో రూపొందించిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది.
Assam Elections 2021: అసోం అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కుస్తీలుపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధికార భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. 70 మందితో రూపొందించిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. అసోంలో మొత్తం 126 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. ఇవాళ 70మందితో జాబితాను విడుదల చేసినట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ వెల్లడించారు.
అలాగే, తమ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ)కి 26 సీట్లు, యునైటెడ్ పీపుల్స్ పార్టీ (లిబరల్)కు 8 సీట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. అసోం ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ మజూలీ నియోజవకర్గం నుంచి, మంత్రి హిమంతబిశ్వ శర్మ జలుక్‌బరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఇవే స్థానాల నుంచే వారిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అసోంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో తొలి విడతలో 47 స్థానాలకు ఎన్నికలు మార్చి 27న జరగనుండగా.. 39 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 1న జరగనుంది. ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్ 40 స్థానాలకు జరగనుంది. ప్రస్తుతం ఒకటి, రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న స్థానాలకు భాజపా నుంచి 70 మంది అభ్యర్థులతో కమలనాథులు జాబితాను విడుదల చేశారు. అస్సాం పార్టీ అభ్యర్థుల జాబితాను ఆమోదించడానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా అగ్ర నాయకులతో కూడిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు అరుణ్‌సింగ్ తెలిపారు.
We are declaring the names of candidates on 70 seatS as of now, out of the 126 seats in Assam Assembly. We are giving 26 seats to Asom Gana Parishad and 8 seats to United People’s Party Liberal (UPPL): Arun Singh, BJP National General Secretary#AssamAssemblyElections2021 pic.twitter.com/SIib4VdmQA
— ANI (@ANI) March 5, 2021
అసోంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో 47 నియోజకవర్గాలు, రెండవ దశలో 39 నియోజకవర్గాల్లో, మూడవ దశలో 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మొదటి దశకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 9, రెండవ దశకు ఇది మార్చి 12, మూడవ దశకు నామినేషన్ పత్రాలను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 19.
ఇదీ చదవండిః మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ.. ఈ నెల 15న ఈడీ ఫ్రదాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు