కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన మానవతా, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో భారతదేశం చాలా ఆచరణాత్మక విధానాన్ని అవలంభించిందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ విధానాలతో దేశంలో మహమ్మారి-ప్రేరేపిత సంక్షోభాలను ఎదుర్కొవడంతోపాటు మితమైన ద్రవ్యోల్బణం, అధిక వృద్ధిని సాధించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) 2023 వార్షిక శిఖారాగ్ర సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకంగా పయనిస్తుందని వివరించారు. మితమైన ద్రవ్యోల్బణంతో దేశంలో స్థిరమైన వృద్ధిని సాధించినట్లు తెలిపారు. మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందని.. ఈ క్రమంలో ఆర్థిక, మానవతా సంక్షోభాల నుంచి కోలుకునేందుకు.. చాలా దేశాలు పెద్ద ఉద్దీపన ప్యాకేజీలను, పలు రకాల ఫ్రేమ్‌వర్క్ లను అనుసరించాయని.. ఇది భారీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీసిందని కేంద్రమంత్రి ప్రతినిధులకు వివరించారు.
కరోనా నాటి నుంచి భారతదేశం చాలా ఆచరణాత్మక విధానాలను అనుసరించిందని.. అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అయితే, కొంతమంది నిపుణులు చెప్పినప్పటికీ మూలధనం చాలా తక్కువగా ఉందని అర్థం చేసుకుని.. పలు విధానాలను ఆచరణలో పెట్టినట్లు వివరించారు. కరోనా సమయంలో ఆర్థిక సహాయం, ఉచిత ఆహారం, ఉచిత వ్యాక్సిన్‌ల కోసం భారత ప్రభుత్వం దృష్టి సారించినట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్నింటినీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో చేర్చమని వైష్ణవ్ వివరించారు. మోడీ నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలు దేశ విధిని మార్చయని.. దీంతో స్థిరమైన వృద్ధి మార్గంలో పయనించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఆచరణాత్మక విధానం కారణంగా అధిక వృద్ధిని, మితమైన ద్రవ్యోల్బణాన్ని సాధించగలిగామంటూ పేర్కొన్నారు.
“మా ప్రధాన మంత్రి కూడా ఆర్థిక విధానం, ద్రవ్య విధానం సమష్టిగా మారేలా చూసారు. ఇలాంటివి ఇతర దేశాలేవీ చేయలేవు. మితమైన ద్రవ్యోల్బణం ప్రధాన లక్ష్యం అని మేము నిర్ధారించాము.. అది కూడా 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కువ కాలం పాటు ఉండేలా చూసుకున్నాము. ఇలా మేము త్వరగా అధిక వృద్ధి రేటుకు తిరిగి వచ్చాము’’ అంటూ అశ్విని వైష్ణవ్ తెలిపారు.
10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు భారత్.. అనే అంశంపై జరిగిన సెషన్‌లో అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ఆర్థిక రంగ సంస్కరణల నుంచి కొత్త పరిశ్రమల అభివృద్ధి వరకు, రాబోయే దశాబ్దంలో భారతదేశ ఆర్థిక పరివర్తనకు ఎలాంటి నిర్దిష్ట చర్యలు దారితీస్తాయి.. అనే విషయాల గురించి ఈ సెషన్ లో చర్చించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..