లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. మే 6వ తేదీన తీర్పు వెల్లడిస్తామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై గత మూడు రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో మే 6 తేదీన తీర్పు వెల్లడించనుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగగా ఈడీ తన వాదనలను వినిపించింది . సెక్షన్ 19 కింద కవితను చట్టబద్ధంగా అరెస్టు చేశామని, అక్రమంగా అరెస్ట్ చేశామని వారు చెబుతున్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదని ఈడీ పేర్కొంది. దాదాపు రెండు గంటలపాటు ఈడీ తమ వాదనను వినిపించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని వెల్లడించింది. లిక్కర్ స్కాంతో ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని పేర్కొన్న ఈడీ రూ.581 కోట్లు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారని, ఐదు నుంచి 12 శాతానికి కమిషన్ పెంచారని పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని, ఆందుకే ఈ కేసులో ఈమె కీలక భూమిక పోషించారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల నుండి అనేక సాక్ష్యాలు దొరికాయని, కవిత ఈడీ అధికారులకు ఇచ్చిన తొమ్మిది ఫోన్లలోనూ డేటా డిలీట్ చేశారని, ఎందుకు డిలీట్ చేశారంటే కవిత సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. కవిత ఫోన్లను పని మనుషులకు ఇచ్చారని, వారిని విచారణ జరిపితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, పనిమనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారంటూ ప్రశ్నించారు. సాక్షాలను ధ్వంసం చేయడమే కాకుండా సాక్షులను కవిత బెదిరించారని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, బెయిల్ ఇవ్వద్దని ఢిల్లీ కోర్టులో బలంగా వాదించింది ఈడీ. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసి మే 6వ తేదీన తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ మే 6 వరకు పొడిగించింది. దీంతో పాటు సీబీఐ కూడా కవితను అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది. గతంలోనూ తమ విచారణకు సహకరించలేదని సీబీఐ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆమె వేసిన బెయిల్ పిటిషన్ గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..