మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో కలిసి పనిచేసే కార్మికుడి పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. అతని ప్రైవేట్ పార్ట్‌లో ఎయిర్ ప్రెజర్ పంపును చొప్పించి.. అమానుషంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిజాంపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతుడిని తుషార్ సదాశివ్ నికుంభ్ (20) అనే కాంట్రాక్టు కార్మికుడిగా గుర్తించారు. నికుంభ్ పనిచేసిన కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీ ఉద్యోగులు తమ దుస్తులకు అంటుకున్న దుమ్మును తొలగించడానికి ఎయిర్ ప్రెజర్ పంపులను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో పని విరామ సమయంలో ఎయిర్ ప్రెషర్ పంపుతో దుమ్మును తొలగిస్తున్న సమయంలో నికుంభ్ కు, నిందితుడి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో నిందితుడు కోపం ఆపుకోలేకపోయాడు. ఎయిర్ ప్రెషర్ పంపును నికుంభ్ ప్రైవేటు పార్టులో చొప్పించాడు. ఎయిర్ కంప్రెసర్ బటన్ నొక్కడంతో గాలి అతని శరీరంలోకి ప్రవేశించింది. దీంతో నికుంభ్ అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు.
నికుంభ్‌ను మొదట నందుర్‌బార్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గుజరాత్‌లోని సూరత్‌కు తీసుకెళ్లారు. అయితే.. అంతర్గత గాయాలు తీవ్రం కావడంతో అతను మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణను ముమ్మరం చేశారు. అంతే కాకుండా కంపెనీ అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కంపెనీ అధికారులతో మాట్లాడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తుల వివరాలను కూడా ఆరా తీస్తున్నారు.
మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు తుషార్ సదాశివ్ నికుంభ్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నికుంభ్ ఈ లోకంలో లేడని కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం