ఖలిస్థాన్ ఉద్యమ నేత అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పంజాబ్ నుంచి మారు వేషంలో పరారైన అమృత్ పాల్ సింగ్ తొలుత హర్యానా వెళ్లినట్టుగా సీసీటీవీ విజువల్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అమృత్ పాల్ పోలీసులు తనను పట్టుకుంటారనే ఆలోచనతో ఉత్తరాఖండ్‌కి మకాం మార్చినట్లు సమాచారం అందింది. తాజాగా అమృత్ పాల్ సింగ్ తలకు టర్బన్ లేకుండా ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ కనిపించినట్లు సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకొచ్చింది. ఆ సమయంలో అమృత్ పాల్ సింగ్ ప్రధాన అనుచరుడైన పపల్ ప్రీత్ సింగ్ కూడా అతడి వెంటే ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీ స్పష్టంచేస్తోంది. తలకు టర్బన్ లేకుండా పెరిగిన జుట్టుతో ఉన్న అమృత్ పాల్ సింగ్.. ముఖానికి మాస్క్ ధరించి కనిపించాడు. అందులో ఉన్నది అసలు అమృత్ పాల్ సింగ్, అతడి అనుచరుడు పపల్ ప్రీత్ సింగేనా లేక అలా కనిపిస్తున్న మరొకరా అనే విషయాన్ని ధృవీకరించుకునే పనిలో ఉన్నారు పోలీసులు. అంతేకాకుండా అసలు సీసీటీవీ కెమెరా దృశ్యాలు కూడా అసలు ఢిల్లీ మార్కెట్ లోనివేనా అనే అనుమానాలు ఉన్నాయి.
మార్చి 18న అమృత్ పాల్ సింగ్ జలంధర్‌లో పోలీసుల నుంచి సినీ ఫక్కీలో దుస్తులు మారుస్తూ, వాహనాలు మారుస్తూ పరారైనప్పటి నుంచి అనేక రకాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్వరలోనే అమృత్ పాల్ సింగ్ ని పట్టుకుంటాం అంటూ కోర్టుకు వివరించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. అయితే అమృత్‌పాల్ సింగ్ నేపాల్‌లో దాక్కున్నట్లు మరో సమాచారం అందుతుంది. అతను నేపాల్ నుంచి వేరే దేశానికి పారిపోకుండా నేపాల్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ కాన్సులర్ సర్వీసెస్ కు లేఖ రాసింది. అమృత్ పాల్‌ను అరెస్టు చేయడంలో ప్రభుత్వ సంస్థలు సాయం చేయాలని ఖాట్మండులోని ఇండియన్ ఎంబసీ కోరింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.