AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాట మారుతున్న రాజకీయ చిత్రం.. మరి బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్లస్సా? మైనస్సా..?

దక్షిణాదిన అత్యధిక లోక్ సభ స్థానాలు(39) ఉన్న రాష్ట్రం తమిళనాడు. పుదుచ్చేరి లోక్‌సభ స్థానాన్ని కలుపుకుంటే మొత్తం 40 స్థానాలు.  కేంద్రంలో అధికారంలో ఉండాలనుకునే పార్టీకి ఈ రాష్ట్రం కీలకంగా ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రావడంతో తమిళ పార్టీల మద్దతు అవసరం లేకపోయింది.

తమిళనాట మారుతున్న రాజకీయ చిత్రం.. మరి బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్లస్సా? మైనస్సా..?
Tamil Nadu Politics DMK Vs ADMK Vs BJP
Ch Murali
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 27, 2023 | 12:52 PM

Share

Tamil Nadu Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమిళనాట రాజకీయ చిత్రం మారుతోంది. గత ఎన్నికల్లో జరిగిందొకటి.. ఇప్పుడు జరుగుతున్నది మరొకటి. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మరింత మారుతున్నాయి తమిళనాట. దక్షిణాదిన అత్యధిక లోక్ సభ స్థానాలు(39) ఉన్న రాష్ట్రం తమిళనాడు. పుదుచ్చేరి లోక్‌సభ స్థానాన్ని కలుపుకుంటే మొత్తం 40 స్థానాలు.  కేంద్రంలో అధికారంలో ఉండాలనుకునే పార్టీకి ఈ రాష్ట్రం కీలకంగా ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రావడంతో తమిళ పార్టీల మద్దతు అవసరం లేకపోయింది. కానీ రాబోయే ఎన్నికల్లో ఇక్కడ సీట్లు కూడా కీలకంగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. శతాధిక రాజకీయ పార్టీలున్న రాష్ట్రం తమిళనాడులో ఐదు దశాబ్ధాలుగా రెండు పార్టీలు మాత్రమే అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నాయి.. అటు.. ఇటు మరి కొన్ని పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నా.. లీడ్ చేస్తున్నది మాత్రం రెండు పార్టీలే.. అవే డీఎంకే, అన్నాడీఎంకే.

గత ఎన్నికల్లో పొత్తుల చిత్రాలు లేదా ఓటర్ల ఏకపక్ష తీర్పుతో లోక్ సభ స్థానాలన్ని డీఎంకే కైవసం చేసుకుంది. 39 లోక్‌సభ స్థానాలున్న తమిళనాడులో 38 స్థానాలను డీఎంకే + కాంగ్రెస్ కూటమి సొంతం చేసుకోగా.. కేవలం ఒక్క స్థానం మాత్రమే ఎడిఎంకే దక్కించుకోగలిగింది. ఆ ఎన్నికల్లో అధికార మార్పుతో డీఎంకేకి పెరిగిన ఓటు బ్యాంకు,  ఎడిఎంకే పొత్తుల పేరుతో చేసిన తప్పిదాలు డీఎంకేకి అన్ని లోక్ సభ స్థానాలు వచ్చాయి అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పటిదాకా ద్విముఖ పొరుగా ఉన్న ఎన్నికల రణరంగ వేదిక ఈ సారి త్రిముఖ పొరుగా మారనుందా..? ఇపుడు తమిళనాట జరుగుతున్న తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది.

డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, మరి కొన్ని పార్టీలు కూటమి (యూపీఏ) గా ఏర్పడి ఈ సారి కూడా ఎన్నికలకు సమయత్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎడిఎంకే పోటీ చేసింది. అప్పట్లో ఎడిఎంకే అధికారంలో ఉన్నా కూడా కనీస లోక్ సభ స్థానాలను దక్కించుకొలేకపోయింది. అందుకు కారణం బిజెపితో కలిసి పోటీ చేయడం ఎడిఎంకే ఘోర పరాజయానికి కారణంగా చెప్పొచ్చు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఎడిఎంకే ఇప్పుడు అడుగులు మొదలుపెట్టింది. అందులో తొలి అడుగు మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో విభేదించడం.. ఎన్డీయే కూటమి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం. వచ్చే ఎన్నికల్లో తనతో కలిసొచ్చే పార్టీలతో కలిసి డీఎంకే కూటమితో తలపడాలనేది ఎడిఎంకే వ్యూహం. తమిళనాట ఉన్న 39 స్థానాల్లో కనీసం 20 స్థానాల్లో అయినా గెలవాలనేది వారి ఆలోచన.

ద్రవిడ వాదం ప్రధాన అస్త్రంగా ఎన్నికల్లో ఓట్లు దండుకోవడమే సంప్రదాయంగా వస్తున్న తమిళనాట.. బిజెపితో పొత్తు మిత్రపక్షానికి నష్టమేనన్నది గత ఎన్నికల ఫలితాలు చెబుతున్న మాట. కేంద్రంలో ఖచ్చితంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉన్న I. N. D. I. A కూటమిలో భాగంగా ఉన్న పార్టీ డీఎంకే. ఇపుడు తమిళనాట అధికారంలో ఉన్నది కూడా డీఎంకే. అలాంటప్పుడు బిజెపి కూడా తమకు సీట్లు దక్కే చోట గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ప్రత్యర్థి బలం పెరగకుండా ఉండాలంటే కాంగ్రెస్ కూటమి సీట్లు పెరగకుండా పక్కా వ్యూహంతో పావులు కదపనుంది. దీని కోసం తనతో కలిసొచ్చే చిన్నా చితక పార్టీలతో జట్టు కట్టి  తమిళనాట వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఎడీఎంకేతో దూరం జరగడం సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. దీంతో తమిళనాడ త్రిముఖ పోటీ ఆవిష్కృతం కానుంది.

అయితే ఎన్డీయే నుంచి ఎడిఎంకే వైదొలగడం వట్టి  రాజకీయ డ్రామాగా డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎడిఎంకే తిరిగి ఎన్డీయేలో చేరుతుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీఎంకే నేతలు భావిస్తున్నారు.  ఇందులో ఎవరి వ్యూహం ఎలా ఉన్నా ఈసారి లోక్ సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదన్న రాజకీయ వాతావరణం తమిళనాట కనబడుతోంది. మొత్తానికి త్రిముఖ పోరు దాదాపు ఖాయం కావడంతో దీంతో తమకు రాజకీయంగా ప్లస్సా.. మైనస్సా? అన్న లెక్కల్లో ప్రధాన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ నేతలు మునిగిపోయారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..