African Swine Fever: ఓ వైపు కరోనా వైరస్, మరోవైపు లంపి మహమ్మారి ముప్పు..ఈ మధ్యలోనే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కూడా దాడిచేయడం ప్రారంభించింది. మధ్యప్రదేశ్ తర్వాత, ఇప్పుడు పంజాబ్‌లో కూడా స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఉత్తరాది రాష్ట్రాలు ఈ మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్‌లోని పాటియాలాలో స్వైన్ ఫ్లూ అనుమానిత లక్షణాలతో 250కి పైగా పందులు చనిపోవడంతో అలర్ట్ ప్రకటించారు. ఈ పందుల నమూనాలను పరీక్షలకు పంపారు. టెస్టు రిపోర్ట్స్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లాల్జిత్ సింగ్ భుల్లర్ వెల్లడించారు. తీవ్ర జ్వరం, చెవులు, కడుపులో రక్తపు మరకలు వంటి లక్షణాలతో పందులలో ఆకస్మిక మరణాలు సంభవించినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని సంబంధిత రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
పాజిటివ్‌గా తేలిన పందులకు సంబంధించిన ఆ రెండు గ్రామాల నుండి ఒక కిలోమీటరు వరకు కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. 10 కిమీ వరకు క్వారంటైన్ ఏర్పాటు చేశారు. పెంపుడు పందులను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి, ప్రాణాంతక వైరల్ వ్యాధిని భోపాల్‌లోని ICAR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ధృవీకరించిందని భుల్లర్ చెప్పారు. పందుల పెంపకందారులు వాటి వ్యర్థాలు, ఏదైనా ఇతర పదార్థాలను బయటకు తీసుకురాకుండా ఉండాలని సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పందుల అంతర్రాష్ట్ర సంచారం, పందుల పెంపకానికి సంబంధించి అన్ని రకాల సరఫరాలను నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అటు, హర్యానాలో కూడా లంపి మహమ్మారి,స్వైన్ ఫ్లూ గురించి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు. కోవిడ్ కాలం మాదిరిగానే మిషన్ మోడ్‌లో పనిచేయాలని ఆయన అధికారులను కోరారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇండోర్‌లో ఇప్పటివరకు 16 మందిలో స్వైన్ ఫ్లూ H1N1 వైరస్ కనుగొనబడింది. వీరిలో నలుగురిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది.
అటు, దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ విధ్వంసం వ్యాప్తి చెందుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు చివరి నుండి సెప్టెంబర్ మధ్య వరకు స్వైన్ ఫ్లూ విధ్వంసం కొనసాగుతుందని హెచ్చరించారు. స్వైన్ ఫ్లూ, కరోనా మహమ్మారి, వైరస్ ద్వారా వ్యాపించే అన్ని వ్యాధులకు ఫేస్‌మాస్క్ మాత్రమే నివారణ చర్య అని నిపుణులు స్పష్టంగా చెప్పారు. ప్రజలు గరిష్టంగా మాస్క్‌లు ధరించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి