AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Political Entry: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం ఖాయమైనట్లేనా?.. అభిమానులకు పంపిన సందేశం సారంశమదేనా..?

దళపతి విజయ్.. మాస్ హీరో.. తమిళనాట ఆయనంటే పడి చచ్చేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత అంతటి గుర్తింపు, అంతటి ఫ్యాన్

Vijay Political Entry: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం ఖాయమైనట్లేనా?.. అభిమానులకు పంపిన సందేశం సారంశమదేనా..?
Shiva Prajapati
|

Updated on: Dec 23, 2020 | 5:47 AM

Share

Vijay Political Entry: దళపతి విజయ్.. మాస్ హీరో.. తమిళనాట ఆయనంటే పడి చచ్చేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత అంతటి గుర్తింపు, అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ మాత్రమే అని చెప్పాలి. తన విలక్ష నటతో, అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే గత కొంత కాలంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తారంటూ తమిళనాట తెగ ప్రచారం జరుగుతోంది. అభిమానులు సైతం ఆయనను రాజకీయాల్లోకి రావాలంటూ బాహాటాంగానే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ అంశంపై విజయ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయన పొలిటికల్ ఎంట్రీపై మాత్రం ఊహాగానాలు, ప్రచారాలు మాత్రం ఆగడం లేదు.

ఇటీవల విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ రాజకీయ పార్టీని ప్రకటించి ఏకంగా ఎన్నికల కమిషన్‌ గుర్తింపుకోసం దరఖాస్తును పంపించి తమిళనాట సంచలనం సృష్టించారు. అయితే చంద్రశేఖర్ చర్య వెనుక విజయ్ ఉన్నాడనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ, దానిని విజయ్ నిర్ద్వందంగా తోసిపుచ్చాడు. తన పేరు చెప్పుకుని ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తన అభిమానులు కూడా ఆ పార్టీలోకి వెళ్లొద్దంటూ పిలుపునిచ్చారు.

ఇదంతా ఇలా ఉంటే తాజాగా దళపతి విజయ్ చేసిన కామెంట్స్ మరోసారి ఆయన రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజకీయ ప్రవేశంపై ఇన్నాళ్లు చడీచప్పుడు కాకుండా ఉన్న విజయ్.. సడన్‌గా చెన్నై శివారు సనయూరులోని తన ఫాంహౌస్‌లో మక్కల్ ఇయక్కం నేతలు, అభిమానులతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తన రాజకీయ రంగ ప్రవేశం జాప్యంపై అసంతృప్తితో ఉన్న అభిమానులెవరూ ఇతర పార్టీలోకి వెళ్లొద్దని పిలుపునిచ్చారు. తన అభిమాన సంఘం ‘మక్కల్ ఇయక్కం’ నుంచి వెళ్లొద్దంటూ విజ్ఞప్తి కూడా చేశారు. ఎంతో సహనంతో ఇన్నేళ్లుగా ఎదరు చూస్తున్న మీ కల సాకారమయ్యే సమయం ఆసన్నమైందని, ఎవరూ అధైర్య పడొద్దంటూ విజయ్ తన అభిమానులకు సందేశం పంపారు. ఈ సందేశం తమిళనాట పెను సంచలనం సృష్టిస్తోంది.

తమిళనాడులో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ తన పార్టీని జనవరిలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దాంతో తమిళ రాజకీయం మరింత వేడెక్కగా.. ఇప్పుడు విజయ్ వ్యాఖ్యలు ఆ హీట్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా, తమిళనాట రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న సినీ ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే విశ్వనటుడు కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగా.. రజనీకాంత్ పార్టీ మరికొద్ది రోజుల్లో పురుడు పోసుకోనుంది. ఇప్పుడు విజయ్ కూడా రంగప్రవేశం చేస్తే.. తమిళ రాజకీయ చిత్రం ఎలా ఉంటుందో మరి వేచి చూడాల్సిందే.