ఆ రాష్ట్రాల్లోనే దళితులపై అరాచకాలు ఎక్కువ.. తాజా నివేదికలో సంచలన విషయాలు..!
దళితులు, గిరిజన-ఆదీవాసీలపై ప్రదర్శించే సామాజిక వివక్ష, దాడులు, అణచివేత, అత్యాచారాలను నియంత్రించడం కోసం ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) యాక్ట్, 1989లో ఏర్పాటైంది. ఈ చట్టం దుర్వినియోగమవుతోందని, తమ వ్యక్తిగత కక్ష సాధించడం కోసం కొందరు దీన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు ఓవైపు ఉన్నాయి. మరోవైపు దళిత, గిరిజన సమాజంపై వివక్ష, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
దళితులు, గిరిజన-ఆదీవాసీలపై ప్రదర్శించే సామాజిక వివక్ష, దాడులు, అణచివేత, అత్యాచారాలను నియంత్రించడం కోసం ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) యాక్ట్, 1989లో ఏర్పాటైంది. ఈ చట్టం దుర్వినియోగమవుతోందని, తమ వ్యక్తిగత కక్ష సాధించడం కోసం కొందరు దీన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు ఓవైపు ఉన్నాయి. మరోవైపు దళిత, గిరిజన సమాజంపై వివక్ష, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడులపై కేసులు పెట్టడానికే భయపడి మౌనంగా భరిస్తున్న ఉదంతాలు కొన్ని ఉంటే, ధైర్యం చేసి కేసు పెట్టినా సరే.. విచారణ ముగిసి నిందితులకు శిక్ష పడేలా చేయడంలో సఫలం కాలేకపోతున్నాయి. ఈ ప్రత్యేక చట్టం ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా నమోదైన కేసులు, గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ దాడులు, వివక్ష పెద్ద ఎత్తున ఇంకా కొనసాగుతున్నాయని అర్థమవుతోంది.
13 రాష్ట్రాల్లో 97.7 శాతం కేసులు
దేశవ్యాప్తంగా నమోదైన అట్రాసిటీ కేసుల్లో 97.7 శాతం కేవలం 13 రాష్ట్రాల్లో నమోదయ్యాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేసుల సంఖ్యలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా 51,656 కేసులు నమోదైతే, 12,287 కేసులు (23.78 శాతం)తో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్ 8,651 (16.75 శాతం) కేసులతో 2వ స్థానంలో, మధ్యప్రదేశ్ 7,732 (14.97 శాతం కేసులతో మూడవ స్థానంలో నిలిచాయి. అట్రాసిటీ కేసులు ఎక్కువగా నమోదైన మిగిలిన రాష్ట్రాల్లో బీహార్ 6,799 (13.16 శాతం), ఒడిశా 3,576 (6.93 శాతం), మహారాష్ట్ర 2,706 (5.24 శాతం) వరుసగా ఉన్నాయి. అంటే 81 శాతం అట్రాసిటీ కేసులు ఈ 6 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని అర్థమవుతోంది.
గిరిజన-ఆదీవాసీలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన అట్రాసిటీ కేసుల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గిరిజన-ఆదీవాసీ బాధితులు పెట్టిన కేసుల సంఖ్య 9,735 కాగా, మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 2,979 కేసులు నమోదయ్యాయి, అంటే 30.61 శాతం ఈ ఒక్క రాష్ట్రం నుంచే ఉన్నాయి. 2,498 (25.66 శాతం) కేసులతో రాజస్థాన్ 2వ స్థానంలో, 773 (7.94 శాతం) కేసులతో ఒడిశా 3వ స్థానంలో నిలిచాయి. వీటి తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర 691 (7.10 శాతం), ఆంధ్రప్రదేశ్ 499 (5.13 శాతం) నిలిచాయి.
తగ్గుతున్న నిరూపిత కేసుల సంఖ్య
కేసులు నమోదు చేయడం వరకు ఒకెత్తయితే, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో నిందితులకు శిక్ష పడేలా చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో చాలా కేసుల్లో చార్జిషీట్లు దాఖలవుతున్నప్పటికీ.. వాటిలో చాలా వరకు సరైన సాక్ష్యాధారాలు లేనికారణంగా కేసుల విచారణ ముగిస్తుండగా.. కొన్నింటిని తప్పుడు ఫిర్యాదులుగా పేర్కొంటూ ముగించినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఎస్సీ సంబంధిత కేసుల్లో 60.38 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు కాగా, 14.78 శాతం కేసులు తప్పుడు ఫిర్యాదు లేదా సాక్ష్యాధారాలు లేకపోవడం వంటి కారణాలతో చార్జిషీట్లు దాఖలు చేసి విచారణ ముగించారు. 2022 చివరి నాటికి 17,166 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్టీలకు సంబంధించిన కేసుల్లో 63.32 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు కాగా, 14.71 శాతం కేసులు చార్జిషీట్ (తుది నివేదికల)తో ముగిశాయి. ఎస్టీలపై అట్రాసిటీలకు సంబంధించి 2,702 కేసుల్లో ఇంకా విచారణ కొనసాగుతోంది.
నివేదికలో ఆందోళన కల్గించే అంశం ఈ చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో శిక్ష రేటు తగ్గడం. 2020లో నేరారోపణ నిరూపణ రేటు 39.2 శాతం ఉండగా.. అది 2022లో 32.4 శాతానికి తగ్గింది. ప్రత్యేక చట్టం ప్రకారం కేసుల విచారణ కొనసాగించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు తక్కువగా ఉన్నాయని కూడా నివేదిక పేర్కొంది.
ప్రత్యేక కోర్టులు – ప్రత్యేక పోలీస్ స్టేషన్లు
ఈ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు 14 రాష్ట్రాల్లోని 498 జిల్లాల్లో 194 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పడ్డాయి. దళిత, గిరిజనులు ఎక్కువగా దాడులకు గురవుతున్న జిల్లాలను నివేదిక గుర్తించింది. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే అటువంటి జిల్లాలను ప్రకటించాయి. ఎస్సీలపై అత్యధిక అట్రాసిటీ కేసులు నమోదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అట్రాసిటీ జోన్‌ను గుర్తించలేదని నివేదిక స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు SC/ST ప్రొటెక్షన్ సెల్‌లను కలిగి ఉన్నాయి. ఇవి కుల ఆధారిత హింసాకాండను నివారించడంతో పాటు, ఆయా వర్గాలకు భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో ఏర్పాటయ్యాయి. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఫిర్యాదుల నమోదు కోసం సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ మరియు నికోబార్ దీవులు, చండీగఢ్, జాతీయ రాజధాని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పుదుచ్చేరి బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్‌లలో ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటయ్యాయని నివేదిక పేర్కొంది. అయితే ఈ చట్టం గురించి అవగాహన లేక దాడుకు గురైనా సరే కేసులు పెట్టడానికి సైతం ముందుకు రాకుండా పోతున్న ఘటనలు దేశంలో ఎన్నున్నాయో లెక్కే లేదు. అదే సమయంలో అవగాహన ఉన్నవారిలో కొందరు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత కక్షసాధింపు కోసం ఉపయోగించుకుంటున్న ఉదంతాలు సైతం లేకపోలేదు.