భోపాల్, ఆగస్టు 4: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ దేవాలయం గోడ కూలడంతో.. శిథిలాల కింద చిక్కుకుని 9 మంది పిల్లలు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన సాగర్ జిల్లాలోని షాపూర్‌లోని హర్దౌల్ బాబా దేవాలయం సమీపంలో చోటుచేసుకుంది. రెస్క్యూ టీం గాయపడిన చిన్నారులను రక్షించి, ఆస్పత్రికి తరలించారు. ఆలయంలో మతపరమైన వేడుకల్లో భాగంగా చిన్నారులు శివలింగాలను తయారు చేస్తుండగా, ఆలయం పక్కనే ఉన్న ఇంటి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. కూలిన ఇల్లు దాదాపు 50 ఏళ్ల నాటిదని, భారీ వర్షాల కారణంగా కూలిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు. ఘటన అనంతరం స్థానికుల సహకారంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి ఇప్పటి వరకు 9 మంది చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన చిన్నారులంతా 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్కులేనని అధికారులు తెలిపారు.
ఈ దుర్ఘటనలో శిధిలాల కింద చిక్కుకున్న భక్తులను కాపాడి, గాయపడ్డ క్షత గాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదంపై సమాచారం అందుకున్న సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య గాయపడ్డ బాధితుల్ని పరామర్శించారు. బాధితులకు వెంటనే వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్ర్భాతంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతి చెందిన చిన్నారుల ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో గోడ కూలిన ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందిన ఒక రోజు వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా గోడ కూలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గోడ కూలిన ఇంటి యజమానిని పోలీసులు అరెస్టు చేశారు.