కరోనా మహమ్మారితో 89 మంది వైద్యులు మృతి… కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని భారత వైద్యుల సంఘం డిమాండ్
కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి వైద్యుల వరకు ప్రతి ఒక్కరిని వెంటాడింది. కరోనా వల్ల ఎందరో వైద్యులు మరణించారు. కరోనా బాధితులకు చికిత్స చేస్తూ తమిళనాడు ..
కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి వైద్యుల వరకు ప్రతి ఒక్కరిని వెంటాడింది. కరోనా వల్ల ఎందరో వైద్యులు మరణించారు. కరోనా బాధితులకు చికిత్స చేస్తూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 89 మంది వైద్యులు మరణించినట్లు తేలిందని, ఇది ఎంతో బాధాకరమని వైద్యుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు చికిత్స చేసే ప్రయత్నంలో వైరస్ సోకి 89 మంది వైద్యులు మృత్యువాత పడ్డారని భారత వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జయలాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
దేశ వ్యాప్తంగా కరోనా నివారణలో భాగంగా భాగంగా 162 మంది వైద్యులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి రాజ్యసభకు వివరించారని, ఇందులో వాస్తవం లేదన్నారు. విధుల్లో పాల్గొంటున్న కరోనా వారియర్స్‌కు కేంద్ర సర్కార్ తగిన భద్రత కల్పించాలని, ప్రాణాలు కోల్పోయిన వైద్యులను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు అనే వ్యత్యాసం చూపకుండా మృతుల కుటుంబాలకు తలా రూ.50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది.
అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రచురించిన గణాంకాల ప్రకారం .. తమిళనాడులో కరోనాతో మరణించిన వారిలో ఎక్కువగా 37 మంది 60ఏళ్లలోపు ఉన్నారు. తర్వాత 50 ఏళ్లలో 21 మంది, 70 ఏళ్ళలో 18 మంది వైద్యులు ఉన్నారు. వారిలో కనీసం 40 మంది సాధారణ అభ్యాసకులు, దాదాపు 30 మంది చెన్నైకి చెందినవారు.
మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర ప్రజా ప్రతినిధులందరికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అనువుగా కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్ అన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విజయభాస్కర్ వ్యాక్సిన్ పంపిణీపై మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రపంచ దేశాలు సైతం ప్రశంసిస్తున్నాయని అన్నారు. పళనిస్వామి ప్రభుత్వానికి ఈ ఘనత దక్కిందన్నారు. కాగా, రాష్ట్రంలో ఆరోగ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లు, వైద్యులు సహా 1.30 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని అన్నారు. మలివిడతగా 50ఏళ్లకు పైబడిన 8.53 లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు.