
చిక్కమగళూరు, జూలై 2: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ఐదేళ్ల పసికందు మొదలు 60 ఏళ్ల ముదుసలి వరకు తారతమ్య భేదాలు లేకుండా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కుప్పకూలి ప్రాణాలొదులుతున్నారు. తాజాగా అలాంటిదే మరో మరణం సంభవించింది. ఓ వ్యక్తి ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో దగ్గరిలోని మెడికల్ షాపులో మందులు కొందామని వచ్చాడు. అయితే షాపు వద్ద మందులు కొంటుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే..
కర్ణాటకలోని చిక్కమగళూరు నగరంలోని కోటే లేఅవుట్‌కు చెందిన విశ్వనాథ్ (60) అనే వ్యక్తి మందులు కొనేందుకు దీప నర్సింగ్ హోమ్ సమీపంలోని ఒక మెడికల్ స్టోర్‌కి శనివారం (జూన్ 28) వెళ్లాడు. అక్కడ తనకు కావల్సిన మందులు అడిగాడు. అనంతరం వాటిని వేసుకునేందుకు నీళ్లు కూడా తీసుకున్నాడు. కానీ షాపులోని వర్కర్లు మందులు ఇచ్చేలోగా విశ్వనాథ్ గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తలరించగా అప్పటికే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. విశ్వనాథ్ కూలిన దృశ్యాలు మెడికల్ షాపులోని సీసీటీవీలో రికార్డైనాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా చిక్కమగళూరులో గత 2 నెలల్లో ఏకంగా 13 మంది గుండెపోటుతో మరణించారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఆకస్మిక గుండెపోటు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం పట్ల ఆరోగ్య అధికారులు, స్థానిక నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరుగున ఉన్న హసన్ జిల్లాలో గత ఒకటిన్నర నెలల్లో గుండెపోటు కారణంగా ఏకంగా 20కి పైగా మరణాలు సంభవించాయి. ముఖ్యంగా హసన్ జిల్లాలో ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు గుండెపోటుతో మరణిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.