AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sela Tunnel: ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో సేలా సొరంగం.. దీని గురించి మీకు తెల్సా..?

డ్రాగన్ కంట్రీ గుండెల్లో దడ పుట్టించే మరో వ్యూహాత్మక ఎత్తుగడ.. పేరు సేలా సొరంగం. మంచు కురిసినా, భారీవర్షాలు భయపెట్టినా మన సైన్యం ఆగమేఘాల మీద వెళ్లి చైనా బోర్జర్‌లో మోహరించే అరుదైన ఏర్పాటు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఎత్తైన కనుమల మధ్య... ఐదేళ్ల పాటు నిర్మితమైన సేలా టన్నెల్ ఇవాళే జాతికి అంకితమైంది. చైనా ఆగడాలకు చెక్ పెట్టడమే కాదు... ఈ భారీ సొరంగం గురించి సూపర్‌స్పెషాలిటీస్ ఇంకా చాలానే ఉన్నాయి.

Sela Tunnel: ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో సేలా సొరంగం.. దీని గురించి మీకు తెల్సా..?
Sela Tunnel
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2024 | 6:25 PM

Share

అరుణాచల్ ప్రదేశ్‌.. పర్యాటకుల మనసు దోచే అందాల సీమ. భారత భూభాగం తూర్పుకొనల్లో వెలసిన భూతల స్వర్గం. కానీ.. పొరుగుదేశం చైనా హుంకరింపులతో సరిహద్దులు ఎర్రబారి.. తరచూ ఉద్రిక్తతకు కేరాఫ్ అవుతోంది అరుణాచల్ ప్రదేశ్‌. యుద్ధం వచ్చినా రాకపోయినా యుద్ధ సన్నాహక చర్యలు మాత్రం తప్పనిసరి. ఆ దిశగా పడ్డ కీలక అడుగే… సేలా టన్నెల్.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ టన్నెల్‌గా చరిత్రకెక్కింది సేలా టన్నెల్. ఈటానగర్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు ప్రధాని మోదీ. సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో… పర్వతాల మధ్య సేలా పాస్‌కి 400 మీటర్ల దిగువన… బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌-BRO ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుంటూ నిర్దేశిత ఐదేళ్ల కాలంలో పూర్తయింది ఈ టన్నెల్ నిర్మాణం. 2019 ఫిబ్రవరి 9న ఈ సొరంగానికి శంకుస్థాపన చేసిన మోదీ.. ఇప్పుడు తన చేతుల మీదుగానే ప్రారంభించారు.

ఈ సొరంగానికైన ఖర్చు 825 కోట్లు. రెండు వరుసలున్న ఈ టన్నెల్‌ మొత్తం పొడవు 12 కిలోమీటర్లు. టన్నెల్‌ – 1 సింగిల్‌ ట్యూబ్‌తో 1,003 మీటర్ల పొడవు ఉంటుంది. టన్నెల్‌ -2 డబుల్ ట్యూబులతో 1,555 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఇందులో ఒకటి సాధారణ ట్రాఫిక్ కోసం.. మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు. ఎటువంటి దాడులకైనా తట్టుకునేలా పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో నిర్మించారు. దీంతో తవాంగ్-దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇండో-చైనా సరిహద్జుల్లోని తూర్పు సెక్టార్‌తో కనెక్టివిటినీ మెరుగుపరచడంలో ఇదొక మేలిమి ప్రయత్నం.

మంచు కురవడం, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడ్డం వల్ల బలిపర-చరిద్వార్-తవాంగ్ రహదారిని తరుచుగా మూసివేయాల్సి వస్తుంది. ఆ సమయంలో మన సైన్యం చైనా సరిహద్దుల్ని చేరుకోవడం అసాధ్యమవుతుంది. ఇప్పడు అందుబాటులోకొచ్చిన టన్నెల్ ద్వారా సరిహద్దు ప్రాంతాలకు దళాల చేరిక, ఆయుధాల అందజేత వేగంగా జరిగే ఛాన్సుంది.

ఇంతకంటే కీలకమైన ప్రయోజనం మరొకటుంది. చైనా సరిహద్దులు అత్యంత ఎత్తులో ఉండడంతో చైనా బలగాలు మన సైనికుల మూమెంట్స్‌ని సులభంగా కనిపెట్టేవి. ఇప్పుడీ సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో డ్రాగన్ దళాలకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది.

అంతేకాదు.. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ తవాంగ్ ప్రజలు ఈ టన్నెల్ ద్వారా అవతలివైపునకు ప్రయాణించే అవకాశం ఉంది. పన్లోపనిగా పర్యాటక రంగం కూడా ఊపందుకోనుంది. టోటల్‌గా అరుణాచల్ ప్రదేశ్‌ కీర్తిమకుటంపై కలికితురాయి.. డ్రాగన్‌ కంట్రీ గుండెల్లో మరో గులకరాయి.. ఈ సేలా సొరంగం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..