Pulwama Attack: స్వచ్ఛమైన ప్రేమ, శాంతికి చిహ్నంగా భావించే ప్రేమికుల రోజు( Valentines Day) ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే భారతదేశ చరిత్రలో మాత్రం ఫిబ్రవరి 14 ను బ్లాక్ డేగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ రోజునే కశ్మీర్‌లోని పుల్వామా (Pulwama ) లో జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. నేటికి ఈ దుశ్చర్య జరిగి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈక్రమంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు దేశమంతా నివాళులు అర్పిస్తోంది. కాగా జమ్మూ కశ్మీర్‌లో 2019 ఫిబ్రవరిలో సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్ కు చెందిన ఉగ్రమూకలు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం)లో ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి మరి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
కాన్వాయ్‌లో మొత్తం 2500 మంది సైనికులు..
కాగా ఈ దాడికి రెండు రోజుల ముందు, పుల్వామాలోని రత్నిపోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఒక జైషే ఉగ్రవాదిని హతమార్చాయి. దీనికి ప్రతీకారంగానే ఉగ్రదాడి జరిగింది. సైనికులనే లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. జమ్మూలోని చెనాని రామ ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సైనికుల కాన్వాయ్ శ్రీనగర్‌కు బయలుదేరింది. మొత్తం78 బస్సుల్లో 2500 మంది సైనికులు తెల్లవారుజామునే ప్రయాణం ప్రారంభించారు. మొత్తం 320 కిలోమీటర్ల దూరం ప్రయాణం. అయితే పుల్వామాలో ముందుగానే మాటువేసిన జైషే ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది.. మొదటి బస్సును దాటుకుంటూ ఐదో వాహానాన్ని ఢీకొట్టాడు. ఆత్మాహుతి దాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే ఉగ్రవాది పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చి సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోని బస్సును ఢీకొట్టాడు. దీంతో మొత్తం 40 మంది సైనికులు అమరులయ్యారు.
సర్జికల్ స్ట్రైక్స్ తో గుణపాఠం..
పుల్వామా ఘటన తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత రగిలిపోయింది. పాక్ ఉగ్రమూకలకు సరైన గుణపాఠం చెప్పాలని భావించింది. అందుకు సర్జికల్ స్ట్రైక్స్ ను ఎంచుకుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న తెల్లవారుజాము సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించిన భారత వైమానిక దళం.. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమార్చినట్లు పేర్కొంది. ఈక్రమంలో ప్రేమకు చిహ్నమైన ప్రేమికుల రోజుల పుల్వామాలో సైనికులపై జరిగిన ఉగ్రదాడిని దేశమంతా మరోసారి గుర్తు చేసుకుంటోంది. ‘జై జవాన్’ అంటూ అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తోంది.