2020 Round Up: దేశ వ్యాప్తంగా ఎన్నికలు.. బీజేపీకి కొంత మోదం.. కొంత ఖేదం..
పార్లమెంటా? అసెంబ్లీయా? స్థానిక సంస్థలా? అని సంబంధం లేదు.. ఎన్నికలు ఏదైనా సై అంటుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.

పార్లమెంటా? అసెంబ్లీయా? స్థానిక సంస్థలా? అని సంబంధం లేదు.. ఎన్నికలు ఏదైనా సై అంటుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. బలమే లేని చోటు బరిలోకి దిగి.. ప్రత్యర్థులకు షాక్ ఇస్తుంది. అధికారం అసాధ్యం అనుకున్న చోట.. అధికార పీఠమెక్కి ఔరా అనిపిస్తుంది. ఇదీ 2014 సార్వత్రిక ఎన్నికల మొదలు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికల్లో బీజేపీ నమోదు చేసిన విజయ ప్రస్థానం.
ఇక 2020 సంవత్సరంలో బీజేపీకి కొంత మోదం.. మరికొంత ఖేదం అనే చెప్పాలి. దేశ రాజధాని ఢిల్లీ సహా, పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల గెలుపొందంగా.. మరికొన్ని చోట్ల ఓటమిపాలైంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ ఏడాది బీజేపీకి బెనిఫిట్ ఇయర్ అనే చెప్పాల్సి ఉంటుంది.
దేశ రాజధానిలో పరాభవం.. ఈ ఏడాది తొలి రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. దీంతో వరుసగా ఐదవ సారీ ఢిల్లీలో బీజేపీకి పరాభవం ఎదురైంది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 62 స్థానాల్లో గెలుపొందింది. ఇక కాంగ్రెస్ అయితే ఖాతానే తెరవలేదు
రాజస్థాన్ మునిసిపల్ ఎన్నికలు.. రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో అక్కడి అదికార పార్టీ కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తం 12 జిల్లాలోని 50 మున్సిపాలిటీలకు సంబంధించి 1, 775 వార్డులకు ఎన్నికలు జరుగగా.. 620 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక బీజేపీ 548 వార్డుల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది.
శబరిమలలో కాషాయ జెండా రెపరెపలు.. ఇక కేరళలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి తన మార్క్ రాజకీయాలను చాటింది. ప్రముఖ శబరిమల దేవస్థానం ఉన్న పండళం మున్సిపాలిటీలో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ ఉన్న 33 వార్డుల్లో 17 స్థానాలు గెలిచి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే మరో ఆరు నెలల్లో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. ఈ విజయం బీజేపీకి మరింత ఉత్సాహాన్నిచ్చినట్లైంది.
తెలంగాణలో తొలిసారి ఘన విజయం.. తెలంగాణలో జరిగిన వరుస ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం నమోదు చేసింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇస్తూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘన విజయం సాధించారు. ఇక ఆవెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. గతంలో కేవలం మూడు నాలుగు వార్డులకే పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా 48 డివిజన్లను కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా అందులో అధికార టీఆర్ఎస్ పార్టీ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందాయి. ఇలా వరుస విజయాలతో ఊపుమీదున్న బీజేపీ శ్రేణులు తదుపరి తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.
బిహార్ ఎన్నికల్లో బీజేపీ హవా.. ఇటీవల బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తన హవాను కొనసాగించింది. తన మిత్ర పక్షాలతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయిన జేడీయూను వెనక్కి నెట్టి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. 75 చోట్ల గెలిచిన ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక బీజేపీ 74 స్థానాలను కైవసం చేసుకుని రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. జేడీయూ 43 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 19, సీపీఐ(ఎంఎల్) 12, హెచ్ఏఎం 4, ఎంఐఎం 5, సీపీఎం 2, సీపీఐ 2 చొప్పున గెలిచాయి.
11 రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి.. ఇటీవల దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని మరోసారి నిరూపించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థలమైన గుజరాత్‌లో 8 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఏడు స్థానాలకు ఎన్నికలు జరిగితే ఆరింట్లో గెలుపొందింది. మణిపూర్‌లో 5 స్థానాలకు పోలింగ్ జరుగగా.. 5 స్థానాలను కైవసం చేసుకుంది. కర్ణాటకలో 2 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఆ రెండింట్లోనూ విజయం నమోదు చేసింది. వీటన్నింటికంటే ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో 28 నియోజకవర్గాలకు ఉపఎన్నిక జరిగింది. వీటిలో 19 సీట్లను కైవసం చేసుకుని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 9 చోట్ల మాత్రమే గెలిచింది. ఒడిశాలో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగగా.. రెండింటిలోనూ అధికార బిజూ జనతాదళ్ విజయం సాధించింది. ఝార్ఖండ్ రాష్ట్రంలో 2 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ 1, ఝార్ఖండ్ ముక్తి మోర్చా 1 చొప్పున విజయం సాధించాయి. ఇక నాగాలాండ్‌లో రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహించగా.. ఒకటి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ గెలుచుకోగా, మరొకట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరిగితే.. కాంగ్రెస్ దానిని కైవసం చేసుకుంది. హర్యానాలోనూ ఒక నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించగా.. కాంగెస్ పార్టీ ఆ స్థానాన్ని గెలుపొందింది.
జమ్మూ కశ్మీర్‌లోనూ ఊహించని విజయం.. జమ్మూకశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండళ్లకు ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికలు ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ ఘన విజయం సాధించింది. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 278 అభివృద్ధి మండళ్లకు ఎన్నికలు జరగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, గుప్‌కార్ అలయెన్స్(నేషన్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్) పోటీ చేశాయి. రాష్ట్ర విభజన తరువాత అక్కడ జరిగిన తొలి ఎన్నికలు కావడంతో బీజేపీకి అక్కడ ఎదురు దెబ్బ ఖాయం అని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను, ఊహలను పటాపంచలు చేస్తూ జమ్మూ కశ్మీర్ లో అధిక సీట్లను గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 75 స్థానాలు గెలుచుకోగా, గుప్‌కార్ అలయెన్స్(ఎన్సీపీకి 67, పీడీపీకి 27), ఇండిపెండెంట్లు 50, కాంగ్రెస్ 26 స్థానాలు గెలుచుకున్నాయి. ఇలా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. జమ్మూలో తన పట్టును నిలుపుకోవడమే కాకుండా.. కశ్మీర్ లోయలోనూ మూడు స్థానాలు గెలుచుకుని బోణీ కొట్టింది. ఇక గుప్‌కార్ అలయెన్స్‌కు 3.94 లక్షల ఓట్లు రాగా, బీజేపీకి 4.87 లక్షల ఓట్లు రావడం విశేషం.




